
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్
చెన్నై : జయలలిత మరణం, పన్నీర్ సెల్వం సీఎం గద్దెనెక్కడం, శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బలనిరూపణకు సిద్ధపడాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. వెంటనే శాసనసభను సమావేశపరచాలని సూచనలు చేసింది.
కాగా ముఖ్యమంత్రి పీఠం మీద జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్‌ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో శశికళను సీఎం చేయాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటోంది. తాజాగా ఐదుగురు మంత్రులు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
ఇక జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పదవిని చేపట్టడంతో.. ఇదే అదనుగా ఆమెకే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేయటం తమిళ రాజకీయాలు ఏ క్షణంలో ఏవిధంగా మలుపు తిరుగుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీరు సెల్వం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన సీఎం సీటును కాపాడుకోవడానికి లోలోపల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన ప్రధాని మోదీనికి కూడా కలిశారు. రాష్ట్రానికి వరద సాయం అందించాలంటూ, అలాగే జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ పన్నీరు సెల్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.