ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ పట్టణ పంచాయతీలకు ‘ఉత్తమర్ గాంధీ’అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీల ప్రగతి, పట్టణ పంచాయతీలకు సంబంధించిన పలు విషయాలపై సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘‘ఈనెల 24వ తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరగనుంది. ప్రజాస్వామ్య దేశంలో పట్టణ పంచాయతీ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలం. డీఎంకే అధికారంలోకి వచ్చినపుడల్లా పంచాయతీలు, పట్టణ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాదికి ఒకరోజు స్థానిక సంస్థల దినంగా జరుపుకోవాలని నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సూచించాను. ఆ మేరకు 2007 నుంచి 2010 వరకు నవంబరు 1వ తేదీ జరుపుకున్నాం.
అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. గ్రామీణుల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా ఇకపై ఏటా నవంబర్ 1వ తేదీ స్థానిక సంస్థల దినోత్సవం నిర్వహిస్తాం. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేలా గ్రామ సచివాలయాలకు ఇప్పటికే అనేక అధికారాలు, బాధ్యతలు ఇచ్చాం. 1998లో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని చట్టం తీసుకొచ్చాం. ఇక ఈ ఏడాది నుంచి ఏటా ఆరు గ్రామసభలు నిర్వహిస్తాం. సుపరిపాలన అందించే పట్టణ పంచాయతీలకు ‘‘ ఉత్తమర్ గాంధీ అవార్డు’’ను ప్రదానం చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏడాది 600 గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తామ’’ని వివరించారు.
చదవండి👉🏾 సోనియా చేతికి నివేదిక
అన్నాడీఎంకే వాకౌట్
రాష్ట్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రోజుకు 17,100 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 13,100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అందుబాటులో లేనందున సరఫరాలో అంతరాయం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.
రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ విమర్శలకు విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బదులిస్తూ, రాష్ట్రపరిధిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగినా సెంట్రల్ గ్రిడ్ నుంచి రావాల్సిన 796 మెగావాట్లు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. తక్కువ ధరతో 3వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే, మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తూ ఎడపాడి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు.
అసెంబ్లీలో అవీ ఇవీ..
►పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎవరూ చేరడం లేదని.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకే నాన్ ముదల్‌వన్ పథకాన్ని తీసుకొచ్చామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చెప్పారు.
►సీఎం స్టాలిన్‌ను మరో కామరాజర్‌గా భావిస్తున్నానని ప్రతిపక్ష పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కీర్తించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment