
నిర్దోషిగానే బయటకు వస్తా: శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్దోషిగానే చెన్నైకి వస్తాను, ఈ స్థితిలో చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలు తరలించవద్దని అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు జైలు అధికారులతోపాటూ తన న్యాయవాదులకు సైతం సూచించినట్లు సమాచారం.
ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న శశికళను ఇటీవల న్యాయవాదులు కలుసుకున్నారు. అన్నాడీఎంకే (అమ్మ) వర్గానికి చెందిన ఎడపాడి పళనిస్వామి తమిళనాడు సీఎంగా ఉన్నందున ఆయనతో మాట్లాడి పుళల్‌జైలుకు తరలింపుపై తగిన ఏర్పాట్లు చేస్తామని శశికళ కేసులు వాదించే న్యాయవాదులు ఆమెకు విన్నవించారు.
అయితే ఆమె అందుకు నిరాకరించారు. నిరపరాధినని పేర్కొంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌ను వేగిరపరిచి నిర్దోషిగా విడుదలపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. పుళల్‌జైలులో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే కారణంతోనే ఆమె నిరాకరించినట్లు సమాచారం.