శశికళ (ఫైల్‌ఫోటో)
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజాగా కొత్త చర్చ మొదలైంది. సీనియర్లుగా ఉన్న కొందరు మాజీ ఎంపీలు చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీ కోసం రాయబారంమొదలెట్టినట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. త్వరలో జైలు నుంచి బయటకు రానున్న శశికళను మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకుందామన్నట్టుగా ఈ మాజీలు రాయబారం మొదలెట్టినట్టుగా చర్చ జోరందుకుంది. జయలలిత నెచ్చెలి శశికళ ఒకప్పడు అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో అన్నాడీఎంకే పగ్గాలు చేజిక్కించుకుని సీఎం కుర్చీలో కూర్చునే ప్రయత్నం బెడిసికొట్టింది. అక్రమాస్తుల కేసులో కటకటాలపాలు కాక తప్పలేదు. పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ వెళ్లినానంతరం అన్నాడీఎంకేలో పరిస్థితులు మారాయి. తాను ఏరి కోరి ఎంపిక చేసిన సీఎం పళనిస్వామి సైతం చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించక తప్పలేదు. చిన్నమ్మ కుటుంబాన్ని అన్నాడీఎంకే నుంచి సాగనంపి, పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉన్న పన్నీరును అక్కున చేర్చుకున్నారు.
ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయ కమిటీకి అధ్యక్షుడుగా పన్నీరుసెల్వం, ఉపాధ్యక్షుడుగా పళనిస్వామి ముందుకు సాగుతున్నారు. అలాగే, పాలనాపరంగా ప్రభుత్వంలో సీఎంగా పళని, డిప్యూటీగా పన్నీరు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్న శశికళ సత్‌ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ బయటకు రాగానే ఆమెను మళ్లీ అన్నాడీఎంకేలోకి ఆహ్వానించే విధంగా మాజీ ఎంపీలు కొందరు రాయబారం మొదలెట్టి ఉండడం వెలుగులోకి వచ్చింది.
రాయబారం:
చిన్నమ్మ శశికళకు అత్యంత సన్నిహితులుగా ఉన్న అనేక మంది నేతలు అన్నాడీఎంకేలో ఉన్నారనే చెప్పవచ్చు. అయితే, పరిస్థితుల ప్రభావం కారణంగా వీరంతా మౌనంగా ఉన్నారు. చిన్నమ్మ జైలు నుంచి రాబోతుండడం దాదాపు ఖరారవుతుండడంతో ఈ నేతలు తమ గలాన్ని విప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొందరు మాజీ ఎంపీలు చిన్నమ్మ తరఫున రాయబారాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీతో సాగించే పనిలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తంబిదురై వంటి నేతలు కూడా చిన్నమ్మకు అనుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఈ మాజీలు తొలుత పళనిస్వామి శిబిరంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి ఉన్నట్టుగా అన్నాడీఎంకేలో చర్చ జోరందుకుంది. పళని శిబిరం చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నా, పన్నీరు ఎలా వ్యవహరిస్తారో అన్నది అంతుచిక్కని దృష్ట్యా ఆయన్ని కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఆ మాజీలు మొదలెట్టి ఉన్నారు.
తంబిదురై రెండు రోజుల క్రితం పన్నీరు సెల్వంను కలిసినట్టు చర్చ ఊపందుకుని ఉంది. దినకరన్‌ను మినహాయించి తక్కిన చిన్నమ్మ కుటుంబీకులను అన్నాడీఎంకేలోకి తీసుకురావడం ద్వారా పార్టీకే లాభం చేకూరుతుందన్న విషయాన్ని ఆ మాజీలు పన్నీరు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ, ప్రభుత్వం ఎలా పయణం సాగిస్తున్నదో దాన్ని అలాగే కొనసాగించేందుకు చిన్నమ్మ ఫ్యామిలీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ, పాలన వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం అన్నది ఇప్పట్లో చిన్నమ్మ చేసుకోబోరని అయితే, ఆమె సేవలు తప్పనిసరి అయిన పక్షంలో రంగంలోకి దింపే విధంగా ముందుకుసాగుదామని ఆ మాజీలు రాయబారాన్ని, సంప్రదింపులను వేగవంతం చేసి ఉండడం అన్నాడీఎంకేలో చర్చకే కాదు గందరగోళానికి సైతం దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment