అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా తమిళనాడువ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా తమిళనాడువ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం అన్నాడీఎంకే సహా పలు పార్టీలకు చెందిన 131 మంది ఎమ్మెల్యేలు చెన్నైలో ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. చెన్నై బీచ్ రోడ్డులోని ఎంజీ రామచంద్రన్ సమాధి వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నల్ల దుస్తులు ధరించి దీక్ష నిర్వహించారు. దీక్షలో 119 మంది అన్నాడీఎంకే, 8 మంది డీఎండీకే రెబెల్ ఎమ్మెల్యేలు, నలుగురు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా జయకు మద్దతుగా జిల్లాల వారీగా ఒక రోజు నిరాహారదీక్షలు చేపట్టారు. చెన్నై మినహా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ప్రసారాలను నిలిపేశారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అన్నాడీఎంకే కార్యకర్తలు శనివారం 12 గంటల బంద్ నిర్వహించారు. బంద్ కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు మూతబడ్డాయి. పుదుచ్చేరి పరిధిలోని కరైకల్, మాహే, యానాంలలోనూ బంద్ కొనసాగింది. కాగా, నిరసనల్లో భాగంగా చెన్నై, నీలగిరి, కన్యాకుమారి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఆదివారం సుమారు 6 వేల బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఫెడరేషన్ ప్రకటించింది. జయ బెయిల్ పిటిషన్ ఈనెల 7న విచారణకు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని ఆమె మద్దతుదారులు నిర్ణయించారు. జయ జైలుపాలవడాన్ని తట్టుకోలేక శనివారం వరకు 62 మంది మృతి చెందారు.
వైద్య సలహా మేరకే బయటి ఆహారం..
బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్న జయలలితకు వైద్యుడి సలహా, సూచనల మేరకు తగు ఆహారాన్ని అందిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ జయసింహా శనివారం మీడియాకు తెలిపారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యుడి సలహా మేరకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుందని అందువల్లే జయకు ఒక్కోసారి బయటి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి వదంతులను నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని జయలలిత జైలులో ఎటువంటి పూజలు చేయలేదన్నారు. జయలలితకు టీవీ ఏర్పాటు చేశామన్న దానిలో నిజం లేదన్నారు. ఇప్పటి వరకు బయటి వ్యక్తులతో కూడా జయ సమావేశం కాలేదని వివరించారు.