అన్నాడీఏంకేలోకి విజయశాంతి? | vijayashanti likely to join in aidmk | Sakshi
Sakshi News home page

అన్నాడీఏంకేలోకి విజయశాంతి?

Published Thu, Jun 8 2017 9:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

అన్నాడీఏంకేలోకి విజయశాంతి?

అన్నాడీఏంకేలోకి విజయశాంతి?

- జైలులో శశికళతో ములాఖత్‌ రహస్యమిదే!
- దినకరన్‌ సూచనతో వడివడిగా అడుగులు
- రజనీకాంత్‌ కంటే ముందే లేడీ సూపర్‌స్టార్‌ ఎంట్రీ


సాక్షి ప్రతినిధి, చెన్నై:
‘ఇదిగో వస్తా.. అదిగో వస్తా..’  అంటూ పొలికల్‌ ఎంట్రీపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండగా.. లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తనకంటూ ప్రత్యేక ఉనికిని చాటుకున్న ఆమె.. తాజాగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జైలులో ఉన్న శశికళతో ఇటీవలే ములాఖాత్‌ అయిన విజయశాంతి.. మరికొద్దిరోజుల్లో అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు తెలిసింది.

జయలలిత మరణానంతరం చెన్నైలో ప్రత్యక్షమైన విజయశాంతి.. ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో టీటీవీ దినకరన్‌ తరఫున ప్రచారం చేశారు. సినీనటిగా విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్‌, ఆమె రాజకీయ అనుభవం అన్నాడీఎంకేకు కలిసివస్తాయని భావించిన దినకరన్‌.. ఆ మేరకు శశికళను ఒప్పించినట్లు తెలిసింది. రజనీకాంత్‌ పొలికట్‌ ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చన్నది దినకరన్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

శశికళతో ములాఖత్‌
ఈనెల 5న దినకరన్‌ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకున్నారు. ఆయన వెళ్లిన కొద్దిసేపట్లోనే విజయశాంతి సైతం చిన్నమ్మతో ములాఖత్‌ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దినకరన్‌ సూచన మేరకు శశికళ.. విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నటిగా జనాకర్షణ, మహిళా నేత ఉంటే పార్టీని కట్టడి చేయడం సులభం అవుతుందని చిన్నమ్మ, దినకరన్‌ అంచనా వేసినట్లు పార్టీ వర్గాల కథనం.

బీజేపీతో మొదలై..
నటిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి ‘లేడీ అమితాబ్‌ బచ్చన్‌’ అనే బిరుదును పొందిన విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. నేటి సీఎం కేసీఆర్‌ అప్పట్లో విజయశాంతికి టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ పోస్టు ఇచ్చి గౌరవించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం (2014 ఎన్నికల సమయంలో) విజయశాంతి అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలోచేరి ఓటమిపాలై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ జయలలిత మరణానంతరం చెన్నైలో సందడిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement