అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సోమవారం మరోసారి తెరపైకివచ్చింది. ఖాళీ అయిన ప్రిసీడియం చైర్మన్ పదవిని తమఖాతాలో వేసుకునేందుకు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, ఉపకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పోటీపడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, చెన్నై: గడిచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజార్చుకున్న తరువాత ప్రధాన నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. అయితే కొంగుమండలం నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారనే కారణంతో ఎడపాడినే ఆ పదవి వరించింది. అప్పటి నుంచి అధికారికంగా స్పందించకపోయినా ఎవరికి వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీలో సమన్వయం కొరవడిందనే విమర్శలకు ఊతమిచ్చేలా, అన్నాడీఎంకే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ పీఎంకే ఒంటరిగానే పోటీచేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే 50 వసంతాల వేడుకలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. కాగా 16వ తేదీన శశికళ చెన్నై మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సమాయుత్తం అవుతారనే అంశం సమాచారం ప్రచారంలో ఉంది.
చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు
‘ప్రిసీడియం’ కోసం పట్టు
పార్టీలో ప్రిసీడియం చైర్మన్ అత్యంత కీలకపదవి. ఈ పదవిలో ఉండిన మధుసూదనన్ ఇటీవల మరణించారు. దీంతో ఈ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం పోటాపోటీగా మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆరంభంలో పన్నీర్‌సెల్వం అనుచరుడిగా వ్యవహరించిన మధుసూదనన్ ఆ తరువాత ఎడపాడి పంచన చేరారు. అంతేగాక పార్టీలో మెజార్టీ నేతలు ఎడపాడి వెనుకే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రిసీడియం చైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టాలని ఎడపాడి పట్టుదలతో ఉన్నారు.
పార్టీ సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా ముగించాల్సి ఉన్నందున ప్రిసీడియం చైర్మన్ పదవి భర్తీని ఆ తరువాత చూసుకోవచ్చని పన్నీర్‌సెల్వం దాటవేస్తున్నారు. పార్టీలో ఇలాంటి గరంగరం వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో నిర్వాహక కార్యవర్గం సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైంది. పన్నీర్‌సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనగలమని అగ్రనేతలు తమ ప్రసంగాల్లో సూచించారు.
సావనీర్ విడుదలపై..
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏటా ప్రిసీడియం చైర్మన్ చేతుల మీదుగా సావనీర్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మధుసూదనన్ మరణం వల్ల ఈ ఏడాది సావనీర్‌ను ఎవరు విడుదల చేస్తారనే అంశం చర్చకు వచ్చింది. ప్రిసీడియం పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడడంతో సంస్థాగత ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని సమావేశంలో వాయిదా వేశారు. ఇక పార్టీని శశికళ తన చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కొనాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment