Assembly elections-
-
తమిళనాడు: అమ్మపార్టీలో.. అంతర్గత పోరు
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సోమవారం మరోసారి తెరపైకివచ్చింది. ఖాళీ అయిన ప్రిసీడియం చైర్మన్ పదవిని తమఖాతాలో వేసుకునేందుకు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, ఉపకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పోటీపడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, చెన్నై: గడిచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజార్చుకున్న తరువాత ప్రధాన నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. అయితే కొంగుమండలం నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారనే కారణంతో ఎడపాడినే ఆ పదవి వరించింది. అప్పటి నుంచి అధికారికంగా స్పందించకపోయినా ఎవరికి వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీలో సమన్వయం కొరవడిందనే విమర్శలకు ఊతమిచ్చేలా, అన్నాడీఎంకే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ పీఎంకే ఒంటరిగానే పోటీచేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే 50 వసంతాల వేడుకలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. కాగా 16వ తేదీన శశికళ చెన్నై మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సమాయుత్తం అవుతారనే అంశం సమాచారం ప్రచారంలో ఉంది. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు ‘ప్రిసీడియం’ కోసం పట్టు పార్టీలో ప్రిసీడియం చైర్మన్ అత్యంత కీలకపదవి. ఈ పదవిలో ఉండిన మధుసూదనన్ ఇటీవల మరణించారు. దీంతో ఈ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం పోటాపోటీగా మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆరంభంలో పన్నీర్‌సెల్వం అనుచరుడిగా వ్యవహరించిన మధుసూదనన్ ఆ తరువాత ఎడపాడి పంచన చేరారు. అంతేగాక పార్టీలో మెజార్టీ నేతలు ఎడపాడి వెనుకే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రిసీడియం చైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టాలని ఎడపాడి పట్టుదలతో ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా ముగించాల్సి ఉన్నందున ప్రిసీడియం చైర్మన్ పదవి భర్తీని ఆ తరువాత చూసుకోవచ్చని పన్నీర్‌సెల్వం దాటవేస్తున్నారు. పార్టీలో ఇలాంటి గరంగరం వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో నిర్వాహక కార్యవర్గం సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైంది. పన్నీర్‌సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనగలమని అగ్రనేతలు తమ ప్రసంగాల్లో సూచించారు. సావనీర్ విడుదలపై.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏటా ప్రిసీడియం చైర్మన్ చేతుల మీదుగా సావనీర్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మధుసూదనన్ మరణం వల్ల ఈ ఏడాది సావనీర్‌ను ఎవరు విడుదల చేస్తారనే అంశం చర్చకు వచ్చింది. ప్రిసీడియం పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడడంతో సంస్థాగత ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని సమావేశంలో వాయిదా వేశారు. ఇక పార్టీని శశికళ తన చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కొనాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. -
ఆరాధ్యులకు గుడి కట్టేవాడా...
సాక్షి, కృష్ణా : కళలకు కేంద్ర బిందువే కాదు... రాజకీయాలకు గుండెకాయ గుడివాడ. ఒకప్పుడు కృష్ణాజిల్లా రాజకీయమంతా గుడివాడ నుంచే. పచ్చని పొలాలు.. పల్లెసీమలు.. అనుబంధాలు.. ఆత్మీయతలకు చిరునామా ఈ పచ్చటిసీమ.వర్తక, వాణిజ్యాలతోపాటు, విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు. ఎందరెందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టిపెరిగి దేశ–విదేశాల్లో కీలకమైన కొలువులు చేపట్టి తమ ప్రాంతానికి వన్నెలీనారు. నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. మాటమీద నిలబడే నేతల భుజం తట్టి ప్రోత్సహించే ఓటర్లు పుష్కలంగా ఉన్న గుడివాడలో గెలుపోటములు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం అవుతాయంటారు సీనియర్లు. పాతికేళ్లు జెడ్పీ చైర్మన్‌గా చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు నుంచి, మూడు సార్లుగా శాసనసభ్యునిగా ఎన్నికైన కొడాలి నాని వరకు నియోజకవర్గంలో హ్యాట్రిక్సే.గుడివాడ నియోజక వర్గం రాజకీయ, సినీ రంగానికి పుట్టినిల్లు.. ఎందరో సినీ ప్రముఖులు ఈ గడ్డనుంచి వెళ్లి వెండి తెరపై వెలుగొందిన వారే. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కైకాల సత్యన్నారాయణ వంటి వారంతా ఇక్కడి నుంచి చిత్రసీమకు వెళ్లిన వారే. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసి దేశానికే వన్నెతెచ్చారు. కేవలం కాలువ నీటిపైనే సాగు భూమి కలిగి ఆక్వా పంటకు పేరున్న నియోజక వర్గం ఇది. అటువంటి నియోజక వర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనియోజక వర్గం పేరు చెప్పగానే ప్రస్తుతం కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని ) గుర్తుకు వస్తారు. ఇప్పటికి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు గుడివాడ నియోజకవర్గంలో మొదటి సారిగా 1955 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన కాకముందు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడపట్టణంతో పాటు మూడు మండలాలు ఉండేవి. ( గుడివాడ, పామర్రు, పెదపారుపూడి). పునర్విభజన అనంతరం పామర్రు కొత్త నియోజక వర్గం కాగా అందులో పెదపారుపూడి కలిసింది. దీంతో గుడివాడ నియోజక వర్గంలోకి గుడివాడ పట్టణంతో పాటు, గుడివాడ మండలం,రద్దయిన ముదినేపల్లి నియోజక వర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరుమండలాలు గుడివాడ నియోజక వర్గంలోకి చేరాయి. అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు2000లో జరిగిన ఉప ఎన్నికల్లో (రావి వెంకటేశ్వరరావు (31997ఓట్లు) ఆయన సోదరుడి మరణానంతరం) 1983లో ఎన్టీ రామారావు (26538ఓట్లు) ,1985 ఎన్టీఆర్ రాజీనామా చేయటంతో రావి శోభనాద్రి చౌదరి (21643ఓట్లు మెజార్టీ)తో గెలుపొందారు. నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 15 పర్యాయాలు ఎన్నికల జరగ్గా వైఎస్సార్ సీపీ–1 కాంగ్రెస్(ఐ)లు –6, ఒక ప్రత్యేక్ష ఎన్నికలో టీడీపీ – 7, ఇండిపెండెంట్లు – 0, బీజేపీ – 0, సీపీఐ–1 ఎన్నికయ్యారు. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి రావి వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విజయం సాధించారు. నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కొడాలి నాని విజయం సాధించారు. దళితుల ఓట్లే కీలకం గుడివాడ నియోజక వర్గంలో దళితుల ఓట్లు కీలకంగా ఉంటాయి. మొత్తం ఓటర్లులో దాదాపు 50 వేల ఓట్లు దళితులవే ఉంటాయి. వీరి తరువాత బీసీ ఓటర్లు, కాపులు అధికంగా ఉన్నారు. గుడివాడ నియోజక వర్గం పునర్విభన అనంతరం గుడివాడ పట్టణం ఓటర్లే కీలకంగా ఉంటాయి. దాదాపు లక్ష మంది ఓటర్లు గుడివాడ పట్టణంలోనే ఉన్నారు. దీంతో గుడివాడ పట్టణం ఓటర్లు ఎటువైపు ఉంటే వారిదే గెలుపని చెప్పారు. హ్యాట్రిక్ సాధించిన నాని గుడివాడ నియోజక వర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన వారు లేరు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మూడుసార్లు వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం నాల్గొవ సారి విజయానికి సిద్ధ్దంగా ఉన్నారు. గుడివాడ అనగానే రాష్ట్రంలో గుర్తుకు వచ్చేది కొడాలి నాని నియోజక వర్గం అని చెప్పాల్సిందే . గుడివాడ రాజకీయాలపై తనదైన ముద్రవేసి ప్రజల మనస్సుల్లో నిండై ఉన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు... మొత్తం ఓటర్లు : 1,99,423 పురుషులు : 96233 మహిళలు : 1,03,171 ఇతరులు : 19 కుల సామాజిక పరంగా ఎస్సీలు : 52,000 కాపులు : 25,000 యాదవులు : 20,000 గౌడ : 14,000 రజక : 5000 బ్రాహ్మణ : 3500 ముస్లీం : 12000 కమ్మ : 12500 రెడ్డి : 5000 -
2022లో అధికారం మనదే!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. 2022 ఎన్నికల్లో తప్పకుండా గుజరాత్లో అధికారంలోకి వస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులపై చర్యలు తప్పకుండా తీసుకుంటానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారని.. అయితేకొందరు పార్టీ నేతల వల్లే కొన్ని విలువైన సీట్లు కోల్పోయామని ఆయన చెప్పారు. శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా ఓటమి పాలైనా.. నైతిక విజయం మాత్రం మనదేనని చెప్పారు. బీజేపీని ఓడించే స్థాయిలో కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు. -
ఎందుకు బాబూ.. ఈ హై‘టెక్కు’లు!
‘వెల్కమ్ టు హెచ్‌పీ ఎనీ టైమ్.. రీఫిల్ బుకింగ్ కోసం ఒకటి నొక్కండి.. అదనపు సిలిండర్ కోసం రెండు నొక్కండి.. చిరునామా మార్పు కోసం మూడు నొక్కండి’.. వంట గ్యాస్ సరఫరాలో ఆన్లైన్ విధానం అమల్లోకి తేవడంతో పట్టణం నుంచి పల్లె ప్రజలకు ఇటువంటి సెల్ ఫోన్ సందేశాలు అలవాటైపోయాయి. ఇదొక్కటే కాదు.. రైల్వేలు, పలు బ్యాంకులు.. ఇంకా అనేక సంస్థలు ఈ ఐవీఆర్ఎస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఇదే విధానం కాస్త రాజకీయ రంగు పులుముకొని మిమ్మల్ని ఏ క్షణంలోనైనా పలకరించవచ్చు. అందులో మీకు బాబు గారి గొంతు వినిపించవచ్చు. అబ్బో.. సాక్షాత్తు బాబుగారే ఫోన్ చేశారని మురిసిపోకండి. అది రికార్డు చేసిన ఎరువు గొంతే తప్ప.. ఆయనగారి అసలు గొంతు కాదు. హైటెక్ జిమ్మిక్కులతో మాయ చేయడంలో దిట్ట అయిన ఆయన అసెంబ్లీ ఎన్నికల కు అభ్యర్థుల నిర్ణయంలో ప్రజాభిప్రాయం పేరుతో చేస్తున్న హై‘టెక్కు’. ప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేసినా ప్రజలను మాయ చేయడానికే ఈ కొత్త ఎత్తు. శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ‘మా నేతను అందరూ హైటెక్ బాబు.. అని అంటుంటే ఏదోలే.. అనుకున్నాం. కీలకమైన ఎన్నికల తరుణంలో దాన్ని మా మీదే ప్రయోగిస్తే ఎలా..? ఎంత టెక్నాలజీ అయితే మాత్రం ఎన్నికల వేళ, ఇంత తక్కువ వ్యవధిలో ఇవన్నీ సాధ్యంకావు. ప్రజాభిప్రాయం పేరుతో ఆయన చేస్తున్న ప్రయోగాలతో ఇప్పటికే దాదాపు ఖరారైన అభ్యర్థులకు కొత్త ఇబ్బం దులు సృష్టించడమేనని జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీలు ఇదే అభిప్రాయంతో ఉన్నా బయటకు చెప్పలేకపోతున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) విధానం ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు సేకరించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఇందులో భాగంగా చంద్రబాబు వాయిస్‌తో రికార్డు చేసిన సమాచారంతో ప్రజలకు ఫోన్ వస్తుంది. సంబంధిత నియోజకవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఫోన్లోనే విన్పిస్తారు. చాయిస్ అడుగుతారు. మొదటి అభ్యర్థి నచ్చితే 1, రెండో అభ్యర్థికి 2, మూడో అభ్యర్థికి 3, ఎవరూ నచ్చకపోతే 0 నొక్కమని సూచన వస్తుంది. ఈ విధంగా సేకరించిన అభిప్రాయాలను ఎంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారో తెలియదు గానీ.. ప్రజాభిప్రాయం ముసుగులో సొంత నిర్ణయాలను ప్రజలు, కార్యకర్తలపై రుద్దే అవకాశం ఉంది. పార్టీ నేతల్లో గుబులు ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ప్రజాగర్జన సభలోనూ చంద్రబాబు ఇదే విషయం ప్రస్తావించడంతో జిల్లా టీడీపీ నేతల్లో గుబులు రేగింది. ముఖ్యంగా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా గత ఐదేళ్లలో లక్షలాది రూ పాయలు ఖర్చు చేసి, కార్యక్రమాలు నిర్వహించి తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకున్న నియోజకవర్గ ఇన్చార్జీల గొంతులో వెలక్కాయ పడింది. ఫోన్ సర్వేల్లో తమ పేర్లు ఖరారవుతాయో.. లేదోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రజల తో తమపై తప్పుడు సమాచారం ఇప్పించే ప్రమా దం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలో వర్గవిభేదాలు ఉన్నందునే వారు ఈ ప్రమాదాన్ని శంకిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి.. ఇటీవలి కాలంలో పార్టీలోకి వచ్చిన వలస పక్షులకు టిక్కెట్లు కట్టబెట్టేందుకుఏ బాబు ప్రజాభి ప్రాయం ట్రిక్కు ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబు.. వారి కోసమే ఈ ఎత్తు వేశారంటున్నారు. జిల్లాలో కూడా మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు వంటి నేతలు ఇటీవలే టీడీపీలో చేరారు. ఇప్పటికే పాతపట్నంలో పార్టీ ఇన్చార్జిగా ఉన్న కొవగాపు సుధాకర్‌ను తప్పించి శత్రుచర్లకు టిక్కెట్ ఇస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఐవీఆర్ఎస్ సర్వే సాకుతో ఇన్‌చార్జీలకు కాకుండా వేరే వారికి టిక్కెట్ల కట్టబెడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.