ఎందుకు బాబూ.. ఈ హై‘టెక్కు’లు!
ఎందుకు బాబూ.. ఈ హై‘టెక్కు’లు!
Published Tue, Apr 8 2014 1:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
‘వెల్‌కమ్ టు హెచ్‌పీ ఎనీ టైమ్.. రీఫిల్ బుకింగ్ కోసం ఒకటి నొక్కండి.. అదనపు సిలిండర్ కోసం రెండు నొక్కండి.. చిరునామా మార్పు కోసం మూడు నొక్కండి’.. వంట గ్యాస్ సరఫరాలో ఆన్‌లైన్ విధానం అమల్లోకి తేవడంతో పట్టణం నుంచి పల్లె ప్రజలకు ఇటువంటి సెల్ ఫోన్ సందేశాలు అలవాటైపోయాయి. ఇదొక్కటే కాదు.. రైల్వేలు, పలు బ్యాంకులు.. ఇంకా అనేక సంస్థలు ఈ ఐవీఆర్‌ఎస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఇదే విధానం కాస్త రాజకీయ రంగు పులుముకొని మిమ్మల్ని ఏ క్షణంలోనైనా పలకరించవచ్చు. అందులో మీకు బాబు గారి గొంతు వినిపించవచ్చు. అబ్బో.. సాక్షాత్తు బాబుగారే ఫోన్ చేశారని మురిసిపోకండి. అది రికార్డు చేసిన ఎరువు గొంతే తప్ప.. ఆయనగారి అసలు గొంతు కాదు. హైటెక్ జిమ్మిక్కులతో మాయ చేయడంలో దిట్ట అయిన ఆయన అసెంబ్లీ ఎన్నికల కు అభ్యర్థుల నిర్ణయంలో ప్రజాభిప్రాయం పేరుతో చేస్తున్న హై‘టెక్కు’. ప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేసినా ప్రజలను మాయ చేయడానికే ఈ కొత్త ఎత్తు.
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ‘మా నేతను అందరూ హైటెక్ బాబు.. అని అంటుంటే ఏదోలే.. అనుకున్నాం. కీలకమైన ఎన్నికల తరుణంలో దాన్ని మా మీదే ప్రయోగిస్తే ఎలా..? ఎంత టెక్నాలజీ అయితే మాత్రం ఎన్నికల వేళ, ఇంత తక్కువ వ్యవధిలో ఇవన్నీ సాధ్యంకావు. ప్రజాభిప్రాయం పేరుతో ఆయన చేస్తున్న ప్రయోగాలతో ఇప్పటికే దాదాపు ఖరారైన అభ్యర్థులకు కొత్త ఇబ్బం దులు సృష్టించడమేనని జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జీలు ఇదే అభిప్రాయంతో ఉన్నా బయటకు చెప్పలేకపోతున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) విధానం ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు సేకరించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఇందులో భాగంగా చంద్రబాబు వాయిస్‌తో రికార్డు చేసిన సమాచారంతో ప్రజలకు ఫోన్ వస్తుంది. సంబంధిత నియోజకవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఫోన్లోనే విన్పిస్తారు. చాయిస్ అడుగుతారు. మొదటి అభ్యర్థి నచ్చితే 1, రెండో అభ్యర్థికి 2, మూడో అభ్యర్థికి 3, ఎవరూ నచ్చకపోతే 0 నొక్కమని సూచన వస్తుంది. ఈ విధంగా సేకరించిన అభిప్రాయాలను ఎంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారో తెలియదు గానీ.. ప్రజాభిప్రాయం ముసుగులో సొంత నిర్ణయాలను ప్రజలు, కార్యకర్తలపై రుద్దే అవకాశం ఉంది.
పార్టీ నేతల్లో గుబులు
ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ప్రజాగర్జన సభలోనూ చంద్రబాబు ఇదే విషయం ప్రస్తావించడంతో జిల్లా టీడీపీ నేతల్లో గుబులు రేగింది. ముఖ్యంగా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా గత ఐదేళ్లలో లక్షలాది రూ పాయలు ఖర్చు చేసి, కార్యక్రమాలు నిర్వహించి తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకున్న నియోజకవర్గ ఇన్‌చార్జీల గొంతులో వెలక్కాయ పడింది. ఫోన్ సర్వేల్లో తమ పేర్లు ఖరారవుతాయో.. లేదోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రజల తో తమపై తప్పుడు సమాచారం ఇప్పించే ప్రమా దం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలో వర్గవిభేదాలు ఉన్నందునే వారు ఈ ప్రమాదాన్ని శంకిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి.. ఇటీవలి కాలంలో పార్టీలోకి వచ్చిన వలస పక్షులకు టిక్కెట్లు కట్టబెట్టేందుకుఏ బాబు ప్రజాభి ప్రాయం ట్రిక్కు ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబు.. వారి కోసమే ఈ ఎత్తు వేశారంటున్నారు. జిల్లాలో కూడా మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు వంటి నేతలు ఇటీవలే టీడీపీలో చేరారు. ఇప్పటికే పాతపట్నంలో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న కొవగాపు సుధాకర్‌ను తప్పించి శత్రుచర్లకు టిక్కెట్ ఇస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఐవీఆర్‌ఎస్ సర్వే సాకుతో ఇన్‌చార్జీలకు కాకుండా వేరే వారికి టిక్కెట్ల కట్టబెడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement