నిన్న లేదు.. నేడు ఉంది!
శ్రీకాకుళం పాతబస్టాండ్: వాతావరణం అనుకూలంగా లేదన్నారు. బుధవారం నుంచి జరగాల్సిన సీఎం పర్యటనను రద్దు చేసేశారు.. ఒక్కరోజులోనే నిర్ణయం మార్చుకున్నారు. వాతావరణం అనుకూలంగా ఉందని తేల్చేశారు!.. రద్దయిన సీఎం పర్యటనను గురువారం ఏర్పాటు చేశారు. అది కూడా రెండు రోజులు.. ఐదు మండలాల్లో జరగాల్సిన పర్యటనను ఒక్కరోజుకు.. ఒకే మండలానికి కుదించేశారు. దీంతో అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు. పర్యటన రద్దయినట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించడంతో అప్పటివరకు చేసిన ఏర్పాట్లు వృథా అయ్యాయని నిరాశ చెందినవారు.. చాలావరకు తొలగించేశారు. బుధవారం మధ్యాహ్నానికి సీన్ మారి మళ్లీ పర్యటన ఉందనడంతో ఈసురోమంటూ మళ్లీ ఏర్పాట్లు మొదలుపెట్టారు.
ఆకస్మిక నిర్ణయాలెందుకో?
సీఎం పర్యటన విషయంలో ఈ దోబూచులాటలెందుకున్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి అధికారులు, టీడీపీ నేతలు చెబుతున్న కారణాలు కూడా అంత సమంజసంగా లేవు. మంగళవారానికి, బుధవారానికి వాతావరణంలో వచ్చిన తేడా ఏదీ లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా ప్రతిరోజూ మధ్యాహ్నం పూట వర్షాలు పడుతున్నాయి. మరి నిన్నటి ప్రతికూలత.. నేడు అనుకూలంగా ఎలా మారిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కాగా ఈ మార్పునకు వేరే కారణాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు అందడంతో చివరి నిమిషంలో సీఎం పర్యటనను రద్దు చేశారు. అయితే అనూహ్యంగా గురువారం ఒక్కరోజుకే పర్యటనను కుదించి, రణస్థలం మండలానికే పరిమితం చేయడం వెనుక కార్పొరేట్ లాబీ ఒత్తిడి బాగా పని చేసిందని తెలుస్తోంది. ముందు ప్రకటించిన సీఎం పర్యటన షెడ్యూల్‌లో వీకేటీ ఫార్మా పరిశ్రమ ప్రారంభోత్సవం ఉంది. మొత్తం పర్యటన రద్దు కావడంతో ఇది కూడా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. దాంతో టీడీపీలో పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేట్ లాబీ రంగంలోకి దిగి గురువారంనాటి పర్యటనను పునరుద్ధరించేలా ఒత్తిడి తెచ్చింది. ఫలితంగానే ఒక రణస్థలం మండలానికే పరిమితం చేస్తూ సీఎం పర్యటనను ఖరారు చేశారు.
దాన్ని కూడా బాగా కుదించినప్పటికీ ఒక్క ఫార్మా పరిశ్రమ ప్రారంభానికే వస్తే కార్పొరేట్ లాబీ ఒత్తిళ్లకు తలొగ్గిన విషయం బయటపడి రచ్చ అవుతుందన్న ఉద్దేశంతోనే డ్వాక్రా సదస్సును మాత్రం షెడ్యూల్ ఉంచి మిగతా వాటిని తొలగించారు. తాజా సమాచారంతో బుధవారం మధ్యాహ్నం నుంచి అధికారులు మళ్లీ ఉరుకులు పరుగులు మొదలెట్టారు. పర్యటన రద్దు కావడంతో మహిళలను రావద్దని సమాచారం పంపిన అధికారులు, బుధవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ అన్ని డ్వాక్రా సంఘాలకు కబురు పంపుతున్నారు. ముందు లేదని, ఇప్పుడు ఉందని చెప్పడంతో ఆశించిన స్థాయిలో మహిళలు వస్తారో లేదోనన్న ఆందోళన అధికారులను వేధిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో మహిళా సంఘాల అధికారులు (వీవోఏలు) నాలుగు రోజులుగా సమ్మెలో ఉన్నారు. దాంతో మహిళల సమీకరణ బాధ్యతను గ్రామ సమాఖ్యల అధ్యక్షులు, ఎన్‌పీఎం కో-ఆర్డినేటర్లకు అప్పగించారు. మహిళలను తరలిం చేందుకు సుమారు 500 బస్సులు ఏర్పాటు చేశారు. అయినా సదస్సు విజయంపై అనుమానాలు వీడటం లేదు.