నేతల్లో ఆనందం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా తొలిసారి పర్యటన నేతల్లో ఆనందం కలిగిం చినా కార్యకర్తల్లో మాత్రం నైరాశ్యం నింపిందనే గుసగసలు వినిపిస్తున్నాయి. ఐదు గంటల పాటు గురువారం రణస్థలం మండలంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బాబు ప్రసంగం ఆద్యంతం మహిళల కోసమే అయినా వారితో నేరుగా ఆయన మాట్లాడడం, మహిళా ప్రజాప్రతినిధులకు వేదికపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పర్యటన రెండు రోజులకు ఖరారైనప్పటికీ ప్రతి కూల వాతావరణం కారణంగా ఒక్కరోజుకే పరిమితమైంది. నాయకులంతా ఐకమత్యంగా పనిచేస్తున్నారని బయట కు చెప్పుకుంటున్నా గురువారం నాటి సీఎం కార్యక్రమాల్లో అది కనిపించలేదు. తమ అధినేత వచ్చి..వెళ్లారనే భావన టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అగ్రనేతలకు కూడా మాట్లాడే అవకాశం దక్కలేదు. బాబు పర్యటనకు వస్తే ఈ కార్యక్రమాలు జరగాలి అని దేశం నేత లు కొన్ని రోజుల క్రితం తీర్మానించుకున్నారు. అయితే అవి కూ డా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
విగ్రహాలకు ఆదరణ కరువు
పార్లమెంట్‌లో ఓ ఊపు ఊపి.. జిల్లా ప్రజల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన ఎర్రన్న విగ్రహానికి
తమ అధినేతతో పూలమాల వేయించాలని భావించిన తమ్ముళ్లకు ఆవేదనే మిగిలింది. బాబు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక నేత, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించారు. బాబు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించలేదన్న బాధలో కార్యకర్తలున్నారు. పినిసిలో మాత్రమే కార్యక్రమం ప్రారంభమైన సమయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యకర్తలు, కొన్ని వర్గాలకు మహిళా సమాఖ్య సదస్సులో వీఐపీ గ్యాలరీల్లో చోటు దక్కలేదు. కొంతమంది బయట చెట్లకింద, కార్లలోనే ఉండిపోవాల్సివచ్చింది. ఐదుగంటలపాటు జరిగిన కార్యమ్రాల్లో భారీ బందోబస్తు నడుమ, కొన్ని వర్గాల నాయకుల పర్యవేక్షణలోనే అంతా అయిందని కార్యకర్తలు మదనపడుతున్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల్లో ఎవరూ మాట్లాడకపోవడం కూడా తమ్ముళ్లని ఆవేదనకు గురి చేసింది.
పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ప్రతిభా భారతి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు బగాది సుశీల కార్యక్రమాలకు హాజరైనా ఎలాంటి ప్రాధాన్యం లభించలేదంటున్నారు. కిమిడి కళావెంకట్రావుకు కొంతైనా ప్రధాన్యం దక్కింది తప్పితే తమ నాయకుడి రాక సందర్భంగా భారీ ఖర్చుతోపాటు కార్యకర్తల్ని వేదిక వద్దకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వివిధ వర్గాలకు, కింది స్థాయి శ్రేణులకు ఎలాంటి ప్రాధాన్యం లభించలేదని చెబుతున్నారు. అలాగే హెలీప్యాడ్ వద్దకు తన కుమార్తెను అనుమతించకపోవడం పై పలాస ఎమ్మెల్యే శివాజీ కూడా ఒకింత నొచ్చుకున్నట్టు తెలిసింది. నాయకుడు రావడం, జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటించడం, కార్యక్రమాలు విజ యవంతం అయినప్పటికీ కార్యకర్తలకు మాత్రం ఊహించినంత స్థాయిలో ఆనందం దక్కలేకపోయిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఏదో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి అధినేత వచ్చినట్టు గా భావిస్తున్నారు తప్పితే పార్టీ పరంగా ఎలాంటి భరోసా దక్కలేదని బాధ పడుతున్నట్టు తెలిసింది.
‘జిల్లాను అభివృద్ధి చేస్తా’
శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన ప్రాంతమైనందున అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని సీఎం నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. రణస్థలం మండలంలోని పతివాడపాలెంలో స్వర్గీ య ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి ఎక్కువ మంది వలస బాట పడుతున్నారన్నారు. అక్కడ విపత్తులు వచ్చినా.. ప్రమాదాలు జరిగినా మృత్యవాత పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా నుంచి వలసలు ఆపాలంటే ముందుగా జిల్లా అభివృద్ధి చెందాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాగ్దా నం చేశారు. జిల్లా అభివృద్ధికి పాటు పడడంతోపాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానన్నారు. జిల్లాలో సముద్రతీర ప్రాంతం ఉండడం వల్ల భావనపాడు, కళింగపట్నంలో పోర్టులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలున్నాయన్నారు. గ్రామాలకు నిరంతరం, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. లక్ష కోట్లుతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని.. కాంగ్రెస్ పాలన లో ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఎన్ని కోట్లు నిధులు అవసరమైనా మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానన్నారు.