నాలుగేళ్లలో నాలుక మడతడింది!
రణస్థలం: నాలుగేళ్లలో చంద్రబాబు నాలుక మడతపడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు.. చేసిన హెచ్చరికలు మడమ తిప్పాయి. కొవ్వాడలో ప్రతిపాదించిన అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడింది. ఇందుకు నిరసనగా ఆందోళనకు ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. అణుపార్కు ఏర్పాటును స్థానికులు, మత్స్యకారులు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్లాంటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టి ఏడాదిపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.
అందులో భాగంగా 2010 సెప్టెంబర్ ఆరో తేదీన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులైన ప్రస్తుత సర్పంచ్ మైలపల్లి పోలీసు, ఇతర నాయకులు కొవ్వాడలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అణు వ్యతిరేక ఉద్యమానికి టీడీపీ బాసటగా ఉంటుం దని స్పష్టం చేశారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పు డు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు అణు పార్కు ప్రతిపాదన రద్దుకు ప్రయత్నించకపోగా ఆ ప్లాంట్ ఏర్పా టుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల ఆరో తేదీన మున్సిపల్ పరి పాలన శాఖ జీవో నెం.186 జారీ చేయడం సరికొత్త ఆందోళనలకు తెర తీసింది.
కొవ్వాడ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరించారు. ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రజల నివాసం, నిర్మాణాలు తదితరాలపై ఆంక్షలు విధించడంతో అణు పార్కు నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమైపోయింది. వాస్తవానికి అణు ఉద్యమం విషయంలో టీడీపీ మొదటినుంచీ సైంధవ పాత్రనే పోషిస్తోంది. పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గతంలో ఉద్యమ నేతలకు చెప్పకుండానే ఏకపక్షంగా దీక్షలు చేస్తున్న వారికి నిమ్మ రసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఇదే కాకుండా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు టీడీపీ నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి తోడకావడంతో స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలకు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీల తీరుపై ముఖ్యమంత్రి సమక్షంలోనే నిరసన వ్యక్తం చేయాలని స్థానిక మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న రణస్థలం మండలంలో ఆయన పర్యటించనుండగా, ఆ సందర్భంగా ఏదో ఒక చోట ఆందోళన చేపట్టాలని వారు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చడం పై చంద్రబాబును నిలదీస్తామని అంటున్నారు.
2010 సెప్టెంబర్ 6.. అది కొవ్వాడ గ్రామం..
టీడీపీ ఆధ్వర్యంలో భారీ సభ.. పాల్గొన్న నేత అప్పటి ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధినేత చంద్రబాబు..
అప్పుడు ఆయన ఏమన్నారంటే..
కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదు. అణు ప్లాంట్ పెట్టి శ్రీకాకుళం జిల్లాను నాశనం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అణు ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రతి ఉద్యమం వెనుకా మా పార్టీ ఉంటుంది.. అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
సరిగ్గా నాలుగేళ్ల తర్వాత..
2014 సెప్టెంబర్ 6.. కొత్తగా అధికారంలోకి వచ్చిన అదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జీవో నెం.186 జారీ చేసింది. కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, ప్రాంతాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరించి.. జనావాసాలు, నిర్మాణాలు, భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడం ఈ జీవో సారాంశం.