ఆ నలుగురూ డుమ్మా!
శ్రీకాకుళం సిటీ : జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్న వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యూయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి కింజరాపు వ్యతిరేక వర్గంగా ముద్రపడిన పలువురు అగ్రనేతలు డుమ్మా కొట్టడంచర్చనీయూంశమైంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన అభ్యర్థులు, ముఖ్య నేతలం తా చంద్రబాబు జిల్లాకు వస్తుండడంపై చర్చించుకున్నారు.
కార్యకర్తలకు మరింత ఉత్సాహం కల్గించే క్రమంలో సమావేశం నిర్వహించారు. ఇంతటి ప్రాధాన్యం గల సమావేశానికి పార్టీలో సీనియర్లుగా ఉన్న నలుగురు మాజీ మంత్రులు దూరం కావడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదు. పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, గౌతు శివాజీలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందనే ప్రచారం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదే బాటలోనే మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కూడా డుమ్మా కొట్టేశారు. వీరంతా ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారు. తమకు సరైన గుర్తింపు లేదంటూ కినుకు వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో కళా, శివాజీలైతే తమకు కాదని జూనియర్లకు మంత్రి స్థాయి పదవులివ్వడంతో కాస్త్త గుంభనంగానే ఉంటున్నారు. ‘కింజరాపు’ రహిత పరిసరాల్లోకి మాత్రం తమ హాజరుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎజెండా సబబు కాదనే!
దివంగత ఎర్రన్నాయుడే ఎజెండాగా మారిన ఈ సమావేశ సారాంశాన్ని ముందే పసిగట్టిన వీరు గైర్హాజరై తమ వ్యతిరేకతను తెలియజేసినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఎర్రన్నాయుడు పేరు ను జిల్లాకు, పోలవ రానికి పెట్టడమనేవి సబబు కాదనేది వీరి నిర్ణయమని తెలుస్తోంది. గతంలో జిల్లాకు గౌతు లచ్చన్న జిల్లా అని పేరు పెట్టాలనేది ఎర్రన్నాయు డు సహా చంద్రబాబు కూడా ప్రకటించిన మాటల్ని ఇప్పుడు శివాజీ తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి మద్దతు కూడగట్టేందుకు జిల్లాకు చెందిన అగ్ర నేతలతో ఇలాంటి వాటికి దూరంగా ఉండేందుకు కూడా వ్యవహారం నడుస్తోందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.
ఇదిలావుంటే కింజరాపు నేతల ఆధిపత్యాన్ని ఏమాత్రం ఇష్టపడని కళా, శివాజీలు పూర్తిస్థాయిలో వ్యతిరేక వర్గం తయారీలో నిమగ్నమయ్యారనే సమాచారం ఇదివరకే రాష్ట్ర పార్టీ అధిష్టానానికి అందిందనే వార్తలొచ్చాయి. ఇక మిగిలిన ఇద్దరిలో సీనియర్ నేత గుండ అప్పలసూర్యనారాయణ ఎన్నికల ఫలితా ల తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా, ఇటీవలే అదే బాటలో ప్రతిభా భారతి ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానం ప్రకటించకపోవడంతోనే ఆమె అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తారని తమ్ముళ్లు గుసగుసలాడుకుం టున్నారు. ఇదిలావుంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ పత్రికలో పార్టీ పటిష్టత కోసం అగ్ర నేతలైన కింజరాపు, కళా, గౌతు తదితరులంతా కలిసికట్టుగా పని చేయనున్నారని, అంతా కలిసిపోయార ంటూ ప్రత్యేక కథనం ప్రచురితమైన రోజే (గురువారం) జరిగిన జిల్లా తెలుగుదేశం సమావేశంలో కళా, గౌతు శివాజీలు గైర్హాజరవ్వడం, వర్గ విభేదాలు స్పష్టమవ్వడం గమనార్హం.
అచ్చెన్న మంత్రాంగం!
సమావేశం ఆద్యంతం మంత్రి అచ్చెన్న తెరవెనుక మంత్రాంగం అనే అర్థమవుతోంది. నేతలు కాకుండా కార్యకర్తలతో మాట్లాడించాలని ప్రతిపాదించిన మంత్రి, తన సూచనల మేరకే కొందరు కార్యకర్తలతో తన మనస్సులోని మాటలను వారి నోట విన్పించారని స్పష్టమైంది. ప్రతి ప్రభుత్వ పథకం పసుపు చొక్కా వర్గానికే ఇవ్వాలని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, సీఎఫ్‌లు(సామాజిక కార్యకర్తలు), అంగన్‌వాడీలు తదితర పోస్టుల్లో టీడీపీ వ్యతిరేకుల్ని వెంటనే ఏరిపారేయాలని కొందరు గట్టిగా చెప్పారు. జిల్లా సమావేశాలకు వచ్చిన వారిని, రానివారిని గుర్తించేలా రిజిస్టర్లు గతం వలే పెట్టాలం టూ మరో కార్యకర్త చెప్పడం...చూస్తుంటే ఇదంతా మంత్రి వ్యూహమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొసమెరుపు
ఎన్నికల తరువాత భారీ స్థాయిలో జరిగిన పార్టీ సమావేశానికి అగ్రనేతలు గైర్హాజరు కావడం, సీఎం రాకను పురస్కరించుకుని తీసుకునే చర్యలకు సంబంధించి పార్టీ సమావేశమైనప్పటికీ కార్యకర్తలు వివిధ రకాలుగా నేతల్ని ప్రశ్నించడం, కొంతమందికే పార్టీలో అగ్రస్థానం కల్పించడం చూస్తుంటే టీడీపీలో విభేదాలు ఉన్నాయనే ఆర్థమవుతోంది.