గుడివాడ నియోజకవర్గం ముఖచిత్రం
సాక్షి, కృష్ణా : కళలకు కేంద్ర బిందువే కాదు... రాజకీయాలకు గుండెకాయ గుడివాడ. ఒకప్పుడు కృష్ణాజిల్లా రాజకీయమంతా గుడివాడ నుంచే. పచ్చని పొలాలు.. పల్లెసీమలు.. అనుబంధాలు.. ఆత్మీయతలకు చిరునామా ఈ పచ్చటిసీమ.వర్తక, వాణిజ్యాలతోపాటు, విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు. ఎందరెందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టిపెరిగి దేశ–విదేశాల్లో కీలకమైన కొలువులు చేపట్టి తమ ప్రాంతానికి వన్నెలీనారు. నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు.
మాటమీద నిలబడే నేతల భుజం తట్టి ప్రోత్సహించే ఓటర్లు పుష్కలంగా ఉన్న గుడివాడలో గెలుపోటములు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం అవుతాయంటారు సీనియర్లు. పాతికేళ్లు జెడ్పీ చైర్మన్‌గా చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు నుంచి, మూడు సార్లుగా శాసనసభ్యునిగా ఎన్నికైన కొడాలి నాని వరకు నియోజకవర్గంలో హ్యాట్రిక్సే.గుడివాడ నియోజక వర్గం రాజకీయ, సినీ రంగానికి పుట్టినిల్లు.. ఎందరో సినీ ప్రముఖులు ఈ గడ్డనుంచి వెళ్లి వెండి తెరపై వెలుగొందిన వారే. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కైకాల సత్యన్నారాయణ వంటి వారంతా ఇక్కడి నుంచి చిత్రసీమకు వెళ్లిన వారే.
సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసి దేశానికే వన్నెతెచ్చారు. కేవలం కాలువ నీటిపైనే సాగు భూమి కలిగి ఆక్వా పంటకు పేరున్న నియోజక వర్గం ఇది. అటువంటి నియోజక వర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనియోజక వర్గం పేరు చెప్పగానే ప్రస్తుతం కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని ) గుర్తుకు వస్తారు. ఇప్పటికి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు
గుడివాడ నియోజకవర్గంలో మొదటి సారిగా 1955 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన కాకముందు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడపట్టణంతో పాటు మూడు మండలాలు ఉండేవి. ( గుడివాడ, పామర్రు, పెదపారుపూడి). పునర్విభజన అనంతరం పామర్రు కొత్త నియోజక వర్గం కాగా అందులో పెదపారుపూడి కలిసింది.
దీంతో గుడివాడ నియోజక వర్గంలోకి గుడివాడ పట్టణంతో పాటు, గుడివాడ మండలం,రద్దయిన ముదినేపల్లి నియోజక వర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరుమండలాలు గుడివాడ నియోజక వర్గంలోకి చేరాయి. అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు2000లో జరిగిన ఉప ఎన్నికల్లో (రావి వెంకటేశ్వరరావు (31997ఓట్లు) ఆయన సోదరుడి మరణానంతరం) 1983లో ఎన్టీ రామారావు (26538ఓట్లు) ,1985 ఎన్టీఆర్ రాజీనామా చేయటంతో రావి శోభనాద్రి చౌదరి (21643ఓట్లు మెజార్టీ)తో గెలుపొందారు. నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 15 పర్యాయాలు ఎన్నికల జరగ్గా వైఎస్సార్ సీపీ–1 కాంగ్రెస్(ఐ)లు –6, ఒక ప్రత్యేక్ష ఎన్నికలో టీడీపీ – 7, ఇండిపెండెంట్లు – 0, బీజేపీ – 0, సీపీఐ–1 ఎన్నికయ్యారు. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి రావి వెంకటేశ్వరరావుపై వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విజయం సాధించారు. నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కొడాలి నాని విజయం సాధించారు.
దళితుల ఓట్లే కీలకం
గుడివాడ నియోజక వర్గంలో దళితుల ఓట్లు కీలకంగా ఉంటాయి. మొత్తం ఓటర్లులో దాదాపు 50 వేల ఓట్లు దళితులవే ఉంటాయి. వీరి తరువాత బీసీ ఓటర్లు, కాపులు అధికంగా ఉన్నారు. గుడివాడ నియోజక వర్గం పునర్విభన అనంతరం గుడివాడ పట్టణం ఓటర్లే కీలకంగా ఉంటాయి. దాదాపు లక్ష మంది ఓటర్లు గుడివాడ పట్టణంలోనే ఉన్నారు. దీంతో గుడివాడ పట్టణం ఓటర్లు ఎటువైపు ఉంటే వారిదే గెలుపని చెప్పారు.
హ్యాట్రిక్ సాధించిన నాని
గుడివాడ నియోజక వర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన వారు లేరు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మూడుసార్లు వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం నాల్గొవ సారి విజయానికి సిద్ధ్దంగా ఉన్నారు. గుడివాడ అనగానే రాష్ట్రంలో గుర్తుకు వచ్చేది కొడాలి నాని నియోజక వర్గం అని చెప్పాల్సిందే . గుడివాడ రాజకీయాలపై తనదైన ముద్రవేసి ప్రజల మనస్సుల్లో నిండై ఉన్నారు.
నియోజకవర్గంలో ఓటర్లు...
మొత్తం ఓటర్లు : 1,99,423
పురుషులు : 96233
మహిళలు : 1,03,171
ఇతరులు : 19
కుల సామాజిక పరంగా
ఎస్సీలు : 52,000
కాపులు : 25,000
యాదవులు : 20,000
గౌడ : 14,000
రజక : 5000
బ్రాహ్మణ : 3500
ముస్లీం : 12000
కమ్మ : 12500
రెడ్డి : 5000
Comments
Please login to add a commentAdd a comment