Kodali Venkateswara Rao (Nani)
-
చంద్రబాబే ఓ రాజకీయ భిక్షగాడు
సాక్షి, అమరావతి: ‘రైతుద్రోహి చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హతే లేదు. చంద్రబాబు ఓ రాజకీయ భిక్షగాడు, ఒక దళారీ. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు పంటలు కొని, ఎక్కువకు అమ్ముకుంటున్న బ్రోకర్..’ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీలతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందేలా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష ► రైతులు వాడుకున్న విద్యుత్‌కు పైసా భారం పడకుండా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ► దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పది కాలాల పాటు ఉండాలనేదే సీఎం జగన్ నిర్ణయం. ► ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం వ్యవస్థీకృతం చేస్తుంటే టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ► నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైఎస్సార్ కుటుంబాలు. అచ్చెన్నాయుడిని హింసించారంటున్నారే.. అలాగైతే పైల్స్ ఆపరేషన్‌కు ఎవరైనా 70 రోజులు ఆసుపత్రిలో ఉంటారా? మామను చంపి.. చంద్రబాబు, వదినను చంపి.. దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారు. ► ‘నేను క్వారీల పేరుతో అక్రమాలు చేసినట్లు చెబుతున్న దేవినేని ఉమా ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఇరిగేషన్ పనుల్లో అవినీతిపై దేవినేని ఉమా సీబీఐ విచారణకు సిద్ధమా?’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు. దేవినేని ఉమా తండ్రి పేరుతో కొండపల్లి గుట్టల్లో క్వారీ ఉందని, త్వరలో దీని వివరాలు బయట పెడతానన్నారు. -
నువ్వేమైనా మైసూర్ మహారాజువా: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందేలా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులు వాడుకున్న విద్యుత్‌కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని శుక్రవారం పునరుద్ఘాటించారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను కరెంట్ విషయంలో ఇబ్బందులకు గురిచేసిందని.. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన హయాంలో రైతులను మానసికంగా హింసించి ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు. మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ.. కుల, మత, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తూ.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని తెలిపారు.(చదవండి: పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?) దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు తనపై విమర్శలకు దిగిన టీడీపీ నేత దేవినేని ఉమాకు కొడాలి నాని ఈ సందర్భంగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దేవినేని ఉమా చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. నువ్వేమైనా మైసూర్ మహారాజువా..?. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు.. వాటిని ఈయన కడిగేవాడు. చంద్రబాబే పెద్ద భిక్షగాడు.. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టడమేంటి? నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్’’ అంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఆయన వల్లే తాను మంత్రిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. (చదవండి: రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే) ‘‘పథకాలను అటకెక్కించిన ఘనత చంద్రబాబుదే. డబ్బులు కట్టలేదని కరెంటు మీటర్లు పీకించిన ఘనత ఆయనదే. ఆయన ప్రభుత్వం పెట్టిన బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించాం. అలాంటి వ్యక్తి చెబుతున్న అబద్ధాలకు ఎల్లోమీడియా వంత పాడుతోంది’’అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హాస్యాస్పదంగా ఉంది: వసంత కృష్ణప్రసాద్ ఉచిత విద్యుత్ గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని.. ఇప్పడు చంద్రబాబు, దేవినేని ఉమా చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. బాబు హయాంలో క్వారీలకు దేవినేని ఉమా అనుమతులు ఇప్పించారని.. త్వరలోనే టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలన్నింటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు ఏపీకి వచ్చారన్న వసంత కృష్ణప్రసాద్.. మంగళగిరిలో లోకేశ్ ఎందుకు ఓడిపోయారో చెప్పగలరా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
ఇసుక కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు..
సాక్షి, అమరావతి: వర్షాకాలం నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందుల్లేకుండా ఇసుక అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమితులైన కమిటీ సభ్యులు, మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్యలు సమీక్ష నిర్వహించారు. భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హరినారాయణ్, గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. ► గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ► గుర్తింపు పొందిన జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ప్రజలు సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడంలో ఇబ్బందుల్లేకుండా చూడాలి. ► నాడు–నేడు, ఉపాధి హామీ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -
మంత్రి కొడాలి నానికి కరోనా నెగిటివ్
కృష్ణాజిల్లా, గుడివాడ : అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి సోమవారం రాత్రి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈపరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాసల్ స్వాబ్ పరీక్ష ద్వారా వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం అధికారులు తెలిపారు. -
ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది: కొడాలి
గుడివాడ(కృష్ణా జిల్లా): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని(కొడాలి వెంకటేశ్వర రావు) తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొడాలి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, రాధాకృష్ణల మధ్య జరిగిన సంభాషణల వీడియోతో వీరి అసలు నైజం బయటపడిందని, ఆ సంభాషణల్లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తనను బాధించాయని కొడాలి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అభిమానిగా ముందు నుంచి చెబుతున్నానని, ఉచ్ఛం, నీచం లేనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని శాపనార్ధాలు పెట్టారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని కొట్టేసి, ఆయన పదవిని కూడా లాక్కుని మరణానికి కారణమైన నీచాతినీచుడు చంద్రబాబు అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది...బయటకు వచ్చి ప్రజలు రాళ్లతో కొడతారేమోనని ఆయన విగ్రహాలకి దండలు వెయ్యటం, పథకాలకి పేరు పెట్టినట్లు నటించడం చంద్రబాబు నాయుడికి అలవాటేనని తూర్పారబట్టారు. బాబు ఎన్టీఆర్ పాలిట దుర్మార్గుడని, రాష్ట్రానికి పట్టిన శని అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు, చంద్రబాబును ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, రాజకీయంగా భూస్థాపితం చెయ్యటానికి తాను ముందు ఉంటానని, ఎన్టీఆర్ అభిమానులు అందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు వెంట ఉంటే ఆయన ఆత్మక్షోబిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ వైఎస్ జగన్ వెంట నడిచి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి చంద్రబాబుకు చరమగీతం పాడాలని విన్నవించారు. -
ఆరాధ్యులకు గుడి కట్టేవాడా...
సాక్షి, కృష్ణా : కళలకు కేంద్ర బిందువే కాదు... రాజకీయాలకు గుండెకాయ గుడివాడ. ఒకప్పుడు కృష్ణాజిల్లా రాజకీయమంతా గుడివాడ నుంచే. పచ్చని పొలాలు.. పల్లెసీమలు.. అనుబంధాలు.. ఆత్మీయతలకు చిరునామా ఈ పచ్చటిసీమ.వర్తక, వాణిజ్యాలతోపాటు, విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు. ఎందరెందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టిపెరిగి దేశ–విదేశాల్లో కీలకమైన కొలువులు చేపట్టి తమ ప్రాంతానికి వన్నెలీనారు. నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. మాటమీద నిలబడే నేతల భుజం తట్టి ప్రోత్సహించే ఓటర్లు పుష్కలంగా ఉన్న గుడివాడలో గెలుపోటములు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం అవుతాయంటారు సీనియర్లు. పాతికేళ్లు జెడ్పీ చైర్మన్‌గా చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు నుంచి, మూడు సార్లుగా శాసనసభ్యునిగా ఎన్నికైన కొడాలి నాని వరకు నియోజకవర్గంలో హ్యాట్రిక్సే.గుడివాడ నియోజక వర్గం రాజకీయ, సినీ రంగానికి పుట్టినిల్లు.. ఎందరో సినీ ప్రముఖులు ఈ గడ్డనుంచి వెళ్లి వెండి తెరపై వెలుగొందిన వారే. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కైకాల సత్యన్నారాయణ వంటి వారంతా ఇక్కడి నుంచి చిత్రసీమకు వెళ్లిన వారే. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసి దేశానికే వన్నెతెచ్చారు. కేవలం కాలువ నీటిపైనే సాగు భూమి కలిగి ఆక్వా పంటకు పేరున్న నియోజక వర్గం ఇది. అటువంటి నియోజక వర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనియోజక వర్గం పేరు చెప్పగానే ప్రస్తుతం కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని ) గుర్తుకు వస్తారు. ఇప్పటికి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు గుడివాడ నియోజకవర్గంలో మొదటి సారిగా 1955 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన కాకముందు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడపట్టణంతో పాటు మూడు మండలాలు ఉండేవి. ( గుడివాడ, పామర్రు, పెదపారుపూడి). పునర్విభజన అనంతరం పామర్రు కొత్త నియోజక వర్గం కాగా అందులో పెదపారుపూడి కలిసింది. దీంతో గుడివాడ నియోజక వర్గంలోకి గుడివాడ పట్టణంతో పాటు, గుడివాడ మండలం,రద్దయిన ముదినేపల్లి నియోజక వర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరుమండలాలు గుడివాడ నియోజక వర్గంలోకి చేరాయి. అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు2000లో జరిగిన ఉప ఎన్నికల్లో (రావి వెంకటేశ్వరరావు (31997ఓట్లు) ఆయన సోదరుడి మరణానంతరం) 1983లో ఎన్టీ రామారావు (26538ఓట్లు) ,1985 ఎన్టీఆర్ రాజీనామా చేయటంతో రావి శోభనాద్రి చౌదరి (21643ఓట్లు మెజార్టీ)తో గెలుపొందారు. నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 15 పర్యాయాలు ఎన్నికల జరగ్గా వైఎస్సార్ సీపీ–1 కాంగ్రెస్(ఐ)లు –6, ఒక ప్రత్యేక్ష ఎన్నికలో టీడీపీ – 7, ఇండిపెండెంట్లు – 0, బీజేపీ – 0, సీపీఐ–1 ఎన్నికయ్యారు. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి రావి వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విజయం సాధించారు. నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కొడాలి నాని విజయం సాధించారు. దళితుల ఓట్లే కీలకం గుడివాడ నియోజక వర్గంలో దళితుల ఓట్లు కీలకంగా ఉంటాయి. మొత్తం ఓటర్లులో దాదాపు 50 వేల ఓట్లు దళితులవే ఉంటాయి. వీరి తరువాత బీసీ ఓటర్లు, కాపులు అధికంగా ఉన్నారు. గుడివాడ నియోజక వర్గం పునర్విభన అనంతరం గుడివాడ పట్టణం ఓటర్లే కీలకంగా ఉంటాయి. దాదాపు లక్ష మంది ఓటర్లు గుడివాడ పట్టణంలోనే ఉన్నారు. దీంతో గుడివాడ పట్టణం ఓటర్లు ఎటువైపు ఉంటే వారిదే గెలుపని చెప్పారు. హ్యాట్రిక్ సాధించిన నాని గుడివాడ నియోజక వర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన వారు లేరు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మూడుసార్లు వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం నాల్గొవ సారి విజయానికి సిద్ధ్దంగా ఉన్నారు. గుడివాడ అనగానే రాష్ట్రంలో గుర్తుకు వచ్చేది కొడాలి నాని నియోజక వర్గం అని చెప్పాల్సిందే . గుడివాడ రాజకీయాలపై తనదైన ముద్రవేసి ప్రజల మనస్సుల్లో నిండై ఉన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు... మొత్తం ఓటర్లు : 1,99,423 పురుషులు : 96233 మహిళలు : 1,03,171 ఇతరులు : 19 కుల సామాజిక పరంగా ఎస్సీలు : 52,000 కాపులు : 25,000 యాదవులు : 20,000 గౌడ : 14,000 రజక : 5000 బ్రాహ్మణ : 3500 ముస్లీం : 12000 కమ్మ : 12500 రెడ్డి : 5000 -
సమరానికి సై అంటున్న వైసీపీ..
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే గెలుపు గుర్రాలను వైఎస్సార్ సీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీనియర్లకు పెద్ద పీట వేస్తూనే.. కొత్త వారికి అవకాశం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ సమ న్యాయాన్ని పాటించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా సమన్వయకర్తలకే సీటు ఇవ్వడంతో అసమ్మతికి ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు.. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో సమరాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.జిల్లాలోని 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకేసారి విడుదల చేశారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ప్రకటించడంపై కార్యకర్తలు, నాయకుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. సిట్టింగ్‌లు, సీనియర్లకు ప్రాధాన్యం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు లభించాయి. గుడివాడ నుంచి కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), నూజివీడు నుంచి మేకాప్రతాప్ అప్పారావు, తిరువూరు నుంచి కె.రక్షణనిధి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మాజీ మంత్రి పార్థసారథి పెనమలూరు, మాజీ ప్రభుత్వ విప్‌లు సామినేని ఉదయభాను, పేర్ని శ్రీ వెంకటేశ్వరరావు(నాని)లు జగ్గయ్యపేట, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి ఎన్నికలో గోదాలో దిగుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుంచి, వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జోగిరమేష్ పెడన నుంచి పోటీ చేస్తున్నారు. కొత్త ముఖాలు.. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు కొత్తగా రంగంలోకి దిగారు. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావ్, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు, పామర్రు నుంచి కైలే అనిల్‌కుమార్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బొప్పన భవకుమార్‌లు ఎన్నికల సమరంలో తమ సత్తా చూపేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. అలాగే గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారికి ఈసారి సీట్లు లభించాయి. నందిగామ నుంచి మొండితోక జగన్మోహనరావు, మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్‌లు మరోసారి పోటీ చేస్తున్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా అన్ని సామాజికవర్గాలకు సమాన ప్రాధాన్యాన్ని కల్పించింది. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు నాలుగేసీ సీట్లు కేటాయించగా, యాదవ వర్గానికి చెందిన పార్థసారథి, గౌడ వర్గానికి చెందిన జోగి రమేష్, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణువర్థన్, వెలమవర్గానికి చెందిన మేకాప్రతాప్ అప్పారావు, వైశ్య వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌లకు సీట్లు కేటాయించి సమన్యాయం చేసిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతా అనుకున్నట్లే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీట్లు కేటాయించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి పార్టీ పదవులు లభిస్తాయనడానికి ఈ సీట్లు కేటాయింపే ఉదాహరణ అని పలువురు నాయకులు చర్చించుకోవడం కనిపించింది. నియోజకవర్గ సమన్వయకర్తలుగా బాధ్యతలు మోస్తున్న వారికందరికీ సీట్లు కేటాయించడంతో అసమ్మతికి అవకాశం లేకుండా పోయింది. విద్యావంతులు.. యువకులు పార్టీలో యువకులకు అనుభవం ఉన్నవారికి, చదువుకున్న వారికి ప్రాధాన్యత లభించింది. మొండితోక జగన్మోహనరావు వైద్యుడిగా నియోజకవర్గంలో అందనికి సుపరిచితుడే. ఇంజినీరింగ్ పూర్తిచేసిన పార్థసారథి ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఎంసీఏ చదివి విదేశీ ఉద్యోగావకాశాలను వదులుకుని ప్రజాసేవకు వచ్చిన కైలే అనిల్‌కుమార్, అమెరికాలో ఐటీ రంగంలో స్థిరపడినప్పటికీ సొంత గడ్డపై ప్రేమతో గన్నవరం వచ్చిన యార్లగడ్డ వెంకట్రావ్‌లను పార్టీ సముచితంగా గౌరవించి సీట్లు కేటాయించింది. సీనియర్లకు అందలం.. ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నాల్గోసారి ఎన్నికల్లో పోటీ చేయనుండగా.. మూడోసారి గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకాప్రతాప్ అప్పారావు ఐదోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు నూజీవీడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య, సామినేని ఉదయభానులు నాల్గోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. -
దుమ్ము దులిపిన ఫ్యాన్
గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ టీడీపీ కంచుకోటని గుండెలు బాదుకునే నేతలకు గుడివాడ ప్రజలు మరోమారు గుణపాఠం నేర్పారు. మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు రుచి చూపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో గుడివాడ టీడీపీ కంచుకోట బద్దలైంది. రెండు ఎన్నికల్లోనూ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఈఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలనే కుట్రలతో టీడీపీతోపాటు కాంగ్రెస్ నేతలు ఏకమైనా వైఎస్సార్సీపీ హవాను ఏమాత్రం ఆపలేకపోయారు. ఎన్నారైలు, కార్పొరేట్ శక్తులు, ధనవంతులు ఏకమై గుడివాడలో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వర్గాన్ని ఓడించాలని సర్వశక్తులు ఒడ్డినా నిరాశే మిగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రేపు అసెంబ్లీ తీర్పుతో వైఎస్సార్సీపీ బలం రెండింతలు పెరుగుతుందని చెబుతున్నారు. మున్సిపల్, పరిషత్‌లో జయకేతనం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గుడివాడ పట్టణ ప్రజలు వైఎస్సార్సీపీని ఆదరించారు. గుడివాడ మున్సిపాల్టీలో 36 వార్డులకు గాను 21 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి స్పష్టమైన మెజార్టీ అందించారు. టీడీపీ కేవలం 15 వార్డులతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన మండల పరిషత్ జిల్లా పరిషత్ కౌంటింగ్‌లోనూ టీడీపీని ఘోరంగా ఓడించారు. మాజీ మంత్రి పిన్నమనేని సొంత మండలం నందివాడలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు.గుడివాడ నియోజక వర్గంలో గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో 37ఎంపీ టీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 22 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసింది. 15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మూడు జెడ్పీటీసీ స్థానాలకు గానూ గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలువగా గుడ్లవల్లేరు మండలంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. గుడివాడ రూరల్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొంది మండలాన్ని చేజిక్కించుకున్నారు. నందివాడ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఆరుచోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. గుడివాడ, నందివాడ ఎంపీపీతోపాటు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కేవలం గుడ్లవల్లేరు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గానూ 7చోట్ల వైఎస్సార్సీపీ గెలువగా 8సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించింది. దీంతో గుడ్లవల్లేరు ఎంపీపీ, జెడ్పీటీసీ టీడీపీకి దక్కింది. ఆనందోత్సాహాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు... మండల పరిషత్ ఫలితాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా రావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ప్రతి రౌండులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కాగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ నేతలు ఫలితాలు చూసి నీరసించారు. ప్రజల ఆకాంక్ష మేరకు గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని వైఎస్సార్సీపీ నియోజక వర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. -
అందరి చూపు..గుడివాడ వైపు
వైఎస్సార్సీపీ టీడీపీ ముఖాముఖి పోరు హ్యాట్రిక్ దిశగా నాని టీడీపీ అభ్యర్థిగా బరిలో రావి కాంగ్రెస్ పోటీ నామమాత్రమే సాక్షి, మచిలీపట్నం : గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై జిల్లావాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందకు సమాయత్తమవుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా రావి బరిలో దిగడంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రావి హరగోపాల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో హరగోపాల్ సోదరుడు రావి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తండ్రి రావి శోభనాద్రి చౌదరి రెండు పర్యాయాలు గుడివాడ ఎమ్మెల్యేగా పని చేశారు. గెలుపు కోసం బాబు పాట్లు గుడివాడలో గెలుపు కోసం చంద్రబాబు అనేక వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాకు వచ్చిన సమయంలోను, కీలక సందర్భాల్లోనూ దృష్టి పెడుతున్నారు. అయితే నియోజకవర్గంపై నానీకి ఉన్న పట్టు ముందు ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నాని గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా మరింత పట్టు సాధించారు. ఎన్నికల సమయాన ఆయన చతురతకు కాకలు తీరిన ప్రత్యర్థులు సైతం చిత్తవుతూ వచ్చారు. జిల్లాలోని వైఎస్సార్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం ఖాయమని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువు నియోజకవర్గంలో కీలక నేత, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొద్ది రోజుల కిందట తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుడివాడలో కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరకని పరస్థితి నెలకొంది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం అట్లూరి సుబ్బారావు పేరును ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రమే. పోరు ప్రధానంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు మధ్యే ఉంటుంది. ప్రధాన సమస్య ఇళ్ల పంపిణీ గుడివాడలో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య ఉంది. వైఎస్ హయాంలో 110ఎకరాలు భూసేకరణ చేసినా ఐదేళ్లుగా పట్టాలు పంచలేదు. ఆ స్థలాల్లో రాజీవ్ ఆవాస్ యోజనలో ఇళ్లు నిర్మిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడంతో నివాసితులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నీటి పథకానికి గండి గుడివాడ నియోజకవర్గంలో చేపల చెరువుల కారణంగా మంచినీటి చెరువుల కలుషిత సమస్య తీవ్రంగా ఉంది. ఐదు మండలాలకు సరిపడే మంచినీటి పథకానికి వైఎస్ హయాంలో మోటూరు గ్రామంలో భూసేకరణ చేశారు. బృహత్తర మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. వైఎస్ మరణానంతరం వివాదాల కారణంగా అనంతరం నిలిచిపోయింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పామర్రు-గుడివాడ ప్రధాన రహదారి రైల్వేఫ్లైఓవర్ అవసరం. ఇది ప్రతిపాదనల దశలో ఆగిపోయింది. నాని ఇమేజ్ ప్లస్ పాయింటు జిల్లాలో కొడాలి నానికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన కన్పిస్తే యువత కేరింతులు కొడుతూ పలుకరిస్తారు. నియోజకవర్గ అభివృద్ధికి అందర్ని కలుపుకోవడం ఆయన ప్రత్యేకత. చొరవ ఉన్న నాయకుడిగా అందరి గుర్తింపు పొందిన ఆయన సమస్యలపై తక్షణం స్పందిస్తారు. కొన్ని సందర్భాల్లో పోరాడే తెగువ ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్రజలకు చేరువకాని రావి ఒక పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీన పడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకేనని పలువురు భావిస్తున్నారు. -
‘బాబు’ అంత నీచుడు దేశంలోనే లేడు
ఈ మాటలన్నది నేనుకాదు ఎన్టీఆర్ ‘ఓదార్పు’తో ప్రజలకు చేరువైన జగన్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీదే గెలుపు వైఎస్, ఎన్టీఆర్, జగన్ పేర్లతోనే గెలుస్తా ‘సాక్షి’ టీవీతో పార్టీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ‘‘మా నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారెన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్, జగన్మోహన్రెడ్డి పేర్లతోనే ప్రజల ముందుకెళ్లి ఓట్లు వేయాలని అడుగుతున్నా. వారు అమలుచేసిన, ప్రకటించిన సంక్షేమ పథకాలను వారికి వివరిస్తున్నా. నా గెలుపు ఖాయం. మరో 16 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానేత కుమారుడు జగన్మోన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తథ్యం’’ అని వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. చంద్రబాబు కన్నా నీచుడు దేశంలో ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. బాబు పరిపాలించిన తొమ్మిదేళ్లూ అన్నివర్గాల ప్రజలను నానా అగచాట్లకు గురిచేశాడని విమర్శించారు. అందుకే ఆయన్ను కాదని 2004 ఎన్నికల్లో ప్రజలు వైఎస్.రాజశేఖరరెడ్డికి పట్టంగట్టార పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడని దుయ్యబట్టారు. అప్పట్లోనే బాబు అంత నీచుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబు ఓ చవటని, అందుకే తన పార్టీలో చవటలందరికీ చోటు ఇచ్చి కార్పొరేట్ వ్యవహారాలకు తెర లేపుతున్నారని ఎద్దేవాచేశారు. తన తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను చిత్రహింసలకు గురిచేసి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తానే గొప్పవాడినని, తానే నీతిమంతుడినని, తన పాల నలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెబుతున్న బాబును వరుసగా 2004, 09 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మే రోజులు పూర్తిగా పోయాయన్నారు. ఆయన ఇక జీవితంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వలేరని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై చూపుతున్నారని పేర్కొన్నారు. ఓదార్పు యాత్రతో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువయ్యారని నాని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోని ప్రజల కష్టాల్ని తెలుసుకున్న ఆయన్నే ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చివరికి గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. మరో 16 రోజుల్లో నూతన రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా మహానేత కుమారుడు జగన్మోన్రెడ్డి బాధ్యతలు చేపడతారని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. -
చంద్రబాబు పచ్చి అవకాశ వాది
సీమాంధ్రలో పొత్తులు రద్దు చేసి బీజేపీ పీకలు కోశాడు ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి గెలవ కూడదనే కుట్ర నమ్మక ద్రోహానికి చంద్రబాబే నిదర్శనం వైఎస్సార్సీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నాని గుడివాడ, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశ వాదని వైఎస్సార్సీపీ గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) దుయ్యబట్టారు. గురువారం కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో బీజేపీ పొత్తులను రద్దు చేసుకోవటంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తెలంగాణాలో టీడీపీకి బలం లేనందున బీజేపీ కాళ్లు పట్టుకుని సీట్లు తీసుకున్న చంద్రబాబు అక్కడ నామినేషన్లు గడువు పూర్తయిందని తెలిసి సీమాంధ్రలో బీజేపీ పీకలు కోశాడని విమర్శించారు. ఏరుదాటాక తెప్ప తగలేయటం ఒక్క చంద్రబాబుకే తెలుసని అన్నారు. ఎన్టీఆర్ కూతురు ఎంపీ కారాదనే... ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరికి బీజేపీ తరపున రాజంపేటలో సీటు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఆమె ఎన్నిక కారాదని ఎన్టీఆర్ కుటుంబం మీద ఉన్న కక్షను ఇలా తీర్చుకున్నాడని అన్నారు. సీమాంధ్రలో బీజేపీ బలహీనంగా ఉందని వ్యూహాత్మకంగా పొత్తును రద్దు చేసుకున్నాడన్నారు. పొత్తులు రద్దుచేసుకుని బీజేపీ పీకను కోసినట్లే ఓట్లేశాక ప్రజల పీకల్ని ఇలాగే కోస్తాడని హెచ్చరించారు. బందరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైయస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు. -
గుడ్డి ప్రభుత్వాలను కూలగొట్టండి
పెడన, న్యూస్‌లైన్ : దేశంలో, రాష్ట్రంలో గుడ్డి ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నాయని, వాటిని కూకటివేళ్లతో కూలగొట్టండని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పిలుపునిచ్చారు. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ శుక్రవారం ఏర్పాటుచేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో నాని మాట్లాడుతూ ఎంపీలు, కేంద్రమంత్రులు మూడు నెలల అధికారం కోసం సీమాంధ్రలో ఉన్న ఆరున్నర కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారని, తమ వ్యాపార లావాదేవీల ముసుగులు ఎక్కడ బయట పడతాయోననే భయంలో ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ అవసరం తీరాక తెప్పతగలేసే రకంగా మారాయన్నారు. వైఎస్ హయాంలో విభజనవాదం వినిపించకుండా చేశారని, ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్ సర్కార్ల అసమర్థత వల్లే విభజన వాదం బయటికొచ్చిందని విమర్శించారు. ఎన్టీఆర్ నడిచిన బాటలో ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని, అందుకే టీడీపీ నేతలు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు. బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో నీరున్న దాళ్వా ఉందా లేదా అని ఇంతవరకు జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక రైతులందరూ దాళ్వాకు సిద్ధంకావాలని, తాము పోరాటం చేసి సాగునీరు విడుదల చేయించేందుకు నడుంబిగిస్తామని భరోసా ఇచ్చారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే డెల్టా ప్రాంతం ఎడారిగా మారి కోస్తా తీర ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ బందరు పార్లమెంటు కన్వీనర్ కుక్కల విద్యాసాగర్, అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, నేతలు ఉప్పాల రాము, మావులేటి వెంకట్రాజు, మాదివాడ రాము, బొడ్డు శ్యామలాదేవి, పిచ్చుక శంకర్, అంకెం సముద్రయ్య, ముత్యాల నాగేశ్వరరావు, సంగా మధు, యాళ్ల బాబులు పాల్గొన్నారు.