చంద్రబాబు పచ్చి అవకాశ వాది
- సీమాంధ్రలో పొత్తులు రద్దు చేసి బీజేపీ పీకలు కోశాడు
- ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి గెలవ కూడదనే కుట్ర
- నమ్మక ద్రోహానికి చంద్రబాబే నిదర్శనం
- వైఎస్సార్‌సీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నాని
గుడివాడ, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశ వాదని వైఎస్సార్‌సీపీ గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) దుయ్యబట్టారు. గురువారం కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో బీజేపీ పొత్తులను రద్దు చేసుకోవటంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తెలంగాణాలో టీడీపీకి బలం లేనందున బీజేపీ కాళ్లు పట్టుకుని సీట్లు తీసుకున్న చంద్రబాబు అక్కడ నామినేషన్లు గడువు పూర్తయిందని తెలిసి సీమాంధ్రలో బీజేపీ పీకలు కోశాడని విమర్శించారు. ఏరుదాటాక తెప్ప తగలేయటం ఒక్క చంద్రబాబుకే తెలుసని అన్నారు.
ఎన్టీఆర్ కూతురు ఎంపీ కారాదనే...
ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరికి బీజేపీ తరపున రాజంపేటలో సీటు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఆమె ఎన్నిక కారాదని ఎన్టీఆర్ కుటుంబం మీద ఉన్న కక్షను ఇలా తీర్చుకున్నాడని అన్నారు. సీమాంధ్రలో బీజేపీ బలహీనంగా ఉందని వ్యూహాత్మకంగా పొత్తును రద్దు చేసుకున్నాడన్నారు. పొత్తులు రద్దుచేసుకుని బీజేపీ పీకను కోసినట్లే ఓట్లేశాక ప్రజల పీకల్ని ఇలాగే కోస్తాడని హెచ్చరించారు.
బందరు పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైయస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు.