అమరావతి, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. తక్షణ సాయం కింద కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని ఓ ప్రచారం జరగ్గా.. కాసేపటికే అతి ఉత్తదని చంద్రబాబు ప్రకటనతో తేలిపోయింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్) నుంచి రూ.3,448 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ఒక ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలతో పాటు పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ మేరకు ప్రకటన చేశారన్నది ఆ ప్రచారసారాంశం. అయితే..
ఒకవైపు.. కేంద్రం ఆ సాయాన్ని విడుదల చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో ఏకంగా ఓ పోస్ట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. త్వరగతిన సాయం విడుదల చేసినందుకుగానూ ఏపీ ప్రజల తరఫున నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారామె.
మరోవైపు.. ఏపీ తెలంగాణకు తక్షణ సహాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి 3,448 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని, ఈ నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, వరద నష్టం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని శివరాజ్ సింగ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. అయితే కాసేపటికే అది ఉత్తప్రచారం అని తేలింది.
కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు. అదంతా రూమర్ మాత్రమే. అసలు ఇంకా నష్టంపై నివేదికను కేంద్రానికి పంపనే లేదు. రేపు(శనివారం) ఆ రిపోర్టును పంపుతాం అని స్పష్టత ఇచ్చారు చంద్రబాబు.
అధికారులపై మళ్లీ చిందులు
వరద బాధితులకు రేషన్ పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు.. మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. ‘‘ఎక్కువ వాహనాలు పెట్టారు. మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు.ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం అని యంత్రాంగంపై ఆక్రోశం ప్రదర్శించారు. ఇవాళ 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం. రేపు మరో 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment