దుమ్ము దులిపిన ఫ్యాన్ | ysrcp josh in gudiwada mptc, zptc elections | Sakshi
Sakshi News home page

దుమ్ము దులిపిన ఫ్యాన్

Published Wed, May 14 2014 3:13 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

దుమ్ము దులిపిన ఫ్యాన్ - Sakshi

దుమ్ము దులిపిన ఫ్యాన్

 గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ టీడీపీ కంచుకోటని గుండెలు బాదుకునే నేతలకు గుడివాడ ప్రజలు మరోమారు గుణపాఠం నేర్పారు.  మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు  రుచి చూపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో గుడివాడ టీడీపీ కంచుకోట బద్దలైంది. రెండు ఎన్నికల్లోనూ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఈఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఓడించాలనే కుట్రలతో టీడీపీతోపాటు కాంగ్రెస్ నేతలు ఏకమైనా వైఎస్సార్‌సీపీ హవాను ఏమాత్రం ఆపలేకపోయారు. ఎన్నారైలు, కార్పొరేట్ శక్తులు, ధనవంతులు ఏకమై గుడివాడలో  కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వర్గాన్ని ఓడించాలని సర్వశక్తులు ఒడ్డినా  నిరాశే మిగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రేపు అసెంబ్లీ తీర్పుతో వైఎస్సార్‌సీపీ బలం రెండింతలు పెరుగుతుందని చెబుతున్నారు.
 
 మున్సిపల్, పరిషత్‌లో జయకేతనం
 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గుడివాడ పట్టణ ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరించారు. గుడివాడ మున్సిపాల్టీలో 36 వార్డులకు గాను 21 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి స్పష్టమైన మెజార్టీ అందించారు. టీడీపీ  కేవలం 15 వార్డులతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన మండల పరిషత్ జిల్లా పరిషత్  కౌంటింగ్‌లోనూ టీడీపీని ఘోరంగా ఓడించారు. మాజీ మంత్రి పిన్నమనేని సొంత మండలం నందివాడలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు.గుడివాడ నియోజక వర్గంలో గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో 37ఎంపీ టీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 22 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేసింది.

15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మూడు జెడ్పీటీసీ స్థానాలకు గానూ గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలువగా  గుడ్లవల్లేరు మండలంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. గుడివాడ రూరల్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు  గెలుపొంది మండలాన్ని  చేజిక్కించుకున్నారు.   నందివాడ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. గుడివాడ, నందివాడ ఎంపీపీతోపాటు జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కేవలం గుడ్లవల్లేరు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గానూ 7చోట్ల వైఎస్సార్‌సీపీ గెలువగా 8సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించింది. దీంతో గుడ్లవల్లేరు ఎంపీపీ, జెడ్పీటీసీ టీడీపీకి దక్కింది.
 
 ఆనందోత్సాహాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు...
 మండల పరిషత్ ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా రావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ప్రతి రౌండులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.  కాగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ నేతలు ఫలితాలు చూసి నీరసించారు.  ప్రజల ఆకాంక్ష మేరకు గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement