అందరి చూపు..గుడివాడ వైపు | everyone eye on gudivada assembly electoral fray | Sakshi
Sakshi News home page

అందరి చూపు..గుడివాడ వైపు

Published Fri, May 2 2014 2:49 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

అందరి చూపు..గుడివాడ వైపు - Sakshi

అందరి చూపు..గుడివాడ వైపు

  •  వైఎస్సార్‌సీపీ టీడీపీ ముఖాముఖి పోరు
  •   హ్యాట్రిక్ దిశగా నాని
  •   టీడీపీ అభ్యర్థిగా బరిలో రావి
  •   కాంగ్రెస్ పోటీ నామమాత్రమే
  •  సాక్షి, మచిలీపట్నం : గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై జిల్లావాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈసారి  వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందకు సమాయత్తమవుతున్నారు.

    టీడీపీ అభ్యర్థిగా రావి బరిలో దిగడంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రావి హరగోపాల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో హరగోపాల్ సోదరుడు రావి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తండ్రి రావి శోభనాద్రి చౌదరి రెండు పర్యాయాలు గుడివాడ ఎమ్మెల్యేగా పని చేశారు.
     
    గెలుపు కోసం బాబు పాట్లు

    గుడివాడలో గెలుపు కోసం చంద్రబాబు అనేక వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాకు వచ్చిన సమయంలోను, కీలక సందర్భాల్లోనూ దృష్టి పెడుతున్నారు. అయితే నియోజకవర్గంపై నానీకి ఉన్న పట్టు ముందు ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నాని గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా మరింత పట్టు సాధించారు. ఎన్నికల సమయాన ఆయన చతురతకు కాకలు తీరిన ప్రత్యర్థులు సైతం చిత్తవుతూ వచ్చారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం ఖాయమని పలువురు భావిస్తున్నారు.
     
    కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువు

    నియోజకవర్గంలో కీలక నేత, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొద్ది రోజుల కిందట తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుడివాడలో కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరకని పరస్థితి నెలకొంది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం అట్లూరి సుబ్బారావు పేరును ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రమే. పోరు ప్రధానంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు మధ్యే ఉంటుంది.
     
    ప్రధాన సమస్య ఇళ్ల పంపిణీ

    గుడివాడలో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య ఉంది. వైఎస్ హయాంలో 110ఎకరాలు భూసేకరణ చేసినా ఐదేళ్లుగా పట్టాలు పంచలేదు. ఆ స్థలాల్లో రాజీవ్ ఆవాస్ యోజనలో ఇళ్లు నిర్మిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడంతో నివాసితులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
     
    నీటి పథకానికి గండి

    గుడివాడ నియోజకవర్గంలో చేపల చెరువుల కారణంగా మంచినీటి చెరువుల కలుషిత సమస్య తీవ్రంగా ఉంది. ఐదు మండలాలకు సరిపడే మంచినీటి పథకానికి వైఎస్ హయాంలో మోటూరు గ్రామంలో భూసేకరణ చేశారు. బృహత్తర మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు.  వైఎస్ మరణానంతరం వివాదాల కారణంగా అనంతరం నిలిచిపోయింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పామర్రు-గుడివాడ ప్రధాన రహదారి రైల్వేఫ్లైఓవర్ అవసరం. ఇది ప్రతిపాదనల దశలో ఆగిపోయింది.
     
    నాని ఇమేజ్ ప్లస్ పాయింటు
     
    జిల్లాలో కొడాలి నానికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన కన్పిస్తే యువత కేరింతులు కొడుతూ పలుకరిస్తారు. నియోజకవర్గ అభివృద్ధికి అందర్ని కలుపుకోవడం ఆయన ప్రత్యేకత. చొరవ ఉన్న నాయకుడిగా అందరి గుర్తింపు పొందిన ఆయన సమస్యలపై తక్షణం స్పందిస్తారు. కొన్ని సందర్భాల్లో పోరాడే తెగువ ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది.
     
    ప్రజలకు చేరువకాని రావి
     
    ఒక పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీన పడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకేనని పలువురు భావిస్తున్నారు.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement