బీజేపీతో పొత్తు వద్దు | AIADMK Not Interest For Alliance With BJP | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తు వద్దు

Published Mon, Feb 18 2019 8:19 AM | Last Updated on Mon, Feb 18 2019 8:19 AM

AIADMK Not Interest For Alliance With BJP - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ పొత్తుకు వ్యతిరేకంగా అధికార పక్షం మిత్రుల్లో వ్యతిరేకత మొదలైంది. అన్నాడీఎంకే చిహ్నంతో అసెంబ్లీ మెట్లు ఎక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ కూటమికి వ్యతిరేకంగా ఆదివారం గలం విప్పారు. ఇది కాస్త అన్నాడీఎంకే సమన్వయ కమిటీని ఇరకాటంలో పెట్టింది. ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యతిరేక స్వరాన్ని అందుకోవడంతో వారిని బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలు సైతం రెండాకుల చిహ్నంపై పోటీ చేయాల్సిందేనన్న హుకుంను అమ్మ జయలలిత జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే కూటమిలోకి వచ్చిన మనిదనేయ జననాయగ కట్టి నేత తమీమున్‌ అన్సారి, కొంగు ఇలంజర్‌ పేరవై తనియరసు, ముక్కళత్తోర్‌ పులిపడై కరుణాస్‌ రెండాకుల చిహ్నంతో అసెంబ్లీ మెట్లు ఎక్కారు.

అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఈ ముగ్గురు సీఎం పళనిస్వామికి అనుకూలంగానే వ్యవహరించారు. మధ్యలతో ఈ ముగ్గురు డీఎంకేకు దగ్గరయ్యే దిశగా ప్రయత్నాలు చేసినా, అక్కడ తలుపులు తెరచుకోలేదు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగుర వేయడం, ఈ ముగ్గురికి కలిసి వచ్చిన అంశం. అయితే, కరుణాస్‌ మాత్రం సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా గళం విప్పి కటకటాల పాలు కాక తప్పలేదు. చివరకు సీఎంకు జైకొట్టి అమ్మ ప్రభుత్వానికే మద్దతు అంటూ కాలం నెట్టుకువస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయమైనా కలిసి చర్చించి తీసుకునే ఈ ముగ్గురు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు తాజాగా బీజేపీకి వ్యతిరేక స్వరాన్ని అందుకున్నారు.

వ్యతిరేక స్వరం :
బీజేపీతో పొత్తు, సీట్ల పందేరాన్ని కొలిక్కి తెచ్చి దివంగత అమ్మ జయలలిత జయంతి సందర్భంగా కూటమిని ప్రకటించాలన్న యోచనలో ఉన్న సమన్వయ కమిటీకి షాక్‌ ఇచ్చే రీతిలో ఆదివారం ఆ ముగ్గురు తెరపైకి వచ్చారు. ఈ నెల 24న తమ జట్టును, ఆ తదుపరి ఆశావహుల ఇంటర్వూ్యలపై దృష్టి పెట్టేందుకు సిద్ధం అవుతున్న సమన్వయ కమిటీని తమీమున్‌ అన్సారీ, కరుణాస్, తనియరసు ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. తమీమ్‌ పేర్కొంటూ, మైనారిటీల మద్దతు తమిళనాడులో అన్నాడీఎంకేకు పుష్కలంగా ఉందన్న విషయాన్ని సమన్వయ కమిటీ పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యవహరించే బీజేపీతో చేతులు కలిపితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.

అందుకే ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. కరుణాస్‌ పేర్కొంటూ, అమ్మ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీకి వ్యతిరేకంగా నిలబడి, రాష్ట్రంలో 37 స్థానాల్ని అమ్మ గత ఎన్నికల్లో చేజిక్కించుకున్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. తనియరసు పేర్కొంటూ,  నీట్‌ రూపంలో తమిళ విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం అయ్యాయని, జలాశయాల విషయంలో కొత్త నాటకాలు తెరపైకి తెచ్చారని, తమిళనాట ప్రగతిని అడ్డుకునే రీతిలో వ్యవహరించిన బీజేపీ పాలకులతో దోస్తీ కట్టడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. అన్నాడీఎంకే తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తే మంచిదని లేనిపక్షంలో నష్టాలు, కష్టాలు తప్పదని హెచ్చరించారు.

బుజ్జగింపులు:
అన్నాడీఎంకే సర్కారు అసలే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. కొందరు ఎమ్మెల్యేలు ఇటు వైపు ఉన్నా,  ఎటువైపు అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం దినకరన్‌కు జై కొడతారో అన్న భయం పాలకుల్ని వెంటాడుతూ వస్తున్నది. అలాగే, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారి పక్షంలో ప్రభుత్వం కష్టాల్లో పడ్డట్టే అన్న ఆందోళన మొదలైంది. దీంతో ఈ ముగ్గుర్ని బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు సీనియర్‌ మంత్రులు రంగంలోకి దిగి ఉండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement