
22న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం
నాలుగురోజులుగా స్తబ్దతగా ఉన్న అన్నాడీఎంకేలో ఎట్టకేలకు అధికారిక కద లిక వచ్చింది. ఈనెల 22న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
సాక్షి, చెన్నై: నాలుగురోజులుగా స్తబ్దతగా ఉన్న అన్నాడీఎంకేలో ఎట్టకేలకు అధికారిక కద లిక వచ్చింది. ఈనెల 22న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఆరోజు ఉదయం 7 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని జయలలిత కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని, అదేరోజు జయ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.
జయ సీఎం అయితే ఆరునెలల్లోగా ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉంటుంది. ఏడాదిలో ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నందున ఉపఎన్నికల నిర్వహణ కోసం ఏదో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఈనెల 23 వ తేదీలోగా రాజీనామా చేయాలని ఎన్నికల సంఘం చెబుతోంది. ఉప ఎన్నికకు పోకుండా ఆరు నెలల తరువాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు జయ సిద్ధం అవుతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ప్రజలను మరింతగా ఆకట్టుకునే సరికొత్త పథకాలను ఈ ఆరు నెలల పాలనలో జయ ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు మార్గం సుగమం చేసుకుంటారని తెలుస్తోంది.