జయలలిత సమాధి వద్ద మైత్రేయన్ నివాళి
సాక్షి, చెన్నై: ‘నేను తీవ్ర మనో వేదనలో ఉన్నా.. ఇక, రాజకీయ పయనాన్ని కాలమే నిర్ణయిస్తుంది’అని అన్నాడీఎంకే మాజీ ఎంపీ మైత్రేయన్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాజ్యసభ పదవీకాలం ముగియడంతో బుధవారం చెన్నైకు వచ్చిన ఆయన మెరీనా తీరంలోని దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత ప్రతినిధిగా ఢిల్లీలో తాను ఇన్నాళ్లు ఉన్నట్టు గుర్తు చేశారు. అమ్మ ఆదేశాల మేరకు మూడు సార్లు రాజ్య సభకు ఎంపికయ్యానని పేర్కొన్నారు. అమ్మ నుంచి వచ్చే ఉత్తర్వులు, ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీలో వ్యవహరిస్తూ వచ్చానని, అయితే, అమ్మ మరణం తదుపరి పరిణామాలతో అక్కడి నుంచి తిరిగి రాక తప్పలేదన్నారు.
తనకు మళ్లీ అవకాశం ఇస్తారని ఎదురు చూశానని, అయితే, న్యాయం జరగలేదన్నారు మైత్రేయన్. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై సీటును ఆశించగా, మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఉండి ఉంటే.. అంటూ ఉద్వేగానికి లోనవుతూ, ప్రాధాన్యత తగ్గి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో దానిని బట్టే తన రాజకీయ పయనం ఉంటుందన్నారు. దానిని కాలమే నిర్ణయిస్తుందన్నారు. అయితే, తాను మాత్రం తీవ్ర మనోవేదనలో ఉన్నానని, తాను ఎవరినీ తప్పు బట్టడం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇన్ని రోజులు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే గెలుపు వెనుక అమ్మ ప్రభంజనం ఉండేదని, ఇక మీదట ఎలా ఉంటుందో అది ప్రజలే నిర్ణయిస్తారని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకేలో జంట నాయకత్వం అన్నది ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నా, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది అమ్మ ప్రభుత్వమేనని, అయితే, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అన్నది మాత్రం చెప్పలేనన్నారు మైత్రేయన్.
Comments
Please login to add a commentAdd a comment