Maitreyan
-
‘వేదనలో ఉన్నా.. ఇక కాలమే నిర్ణయిస్తుంది’
సాక్షి, చెన్నై: ‘నేను తీవ్ర మనో వేదనలో ఉన్నా.. ఇక, రాజకీయ పయనాన్ని కాలమే నిర్ణయిస్తుంది’అని అన్నాడీఎంకే మాజీ ఎంపీ మైత్రేయన్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాజ్యసభ పదవీకాలం ముగియడంతో బుధవారం చెన్నైకు వచ్చిన ఆయన మెరీనా తీరంలోని దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత ప్రతినిధిగా ఢిల్లీలో తాను ఇన్నాళ్లు ఉన్నట్టు గుర్తు చేశారు. అమ్మ ఆదేశాల మేరకు మూడు సార్లు రాజ్య సభకు ఎంపికయ్యానని పేర్కొన్నారు. అమ్మ నుంచి వచ్చే ఉత్తర్వులు, ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీలో వ్యవహరిస్తూ వచ్చానని, అయితే, అమ్మ మరణం తదుపరి పరిణామాలతో అక్కడి నుంచి తిరిగి రాక తప్పలేదన్నారు. తనకు మళ్లీ అవకాశం ఇస్తారని ఎదురు చూశానని, అయితే, న్యాయం జరగలేదన్నారు మైత్రేయన్. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై సీటును ఆశించగా, మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఉండి ఉంటే.. అంటూ ఉద్వేగానికి లోనవుతూ, ప్రాధాన్యత తగ్గి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో దానిని బట్టే తన రాజకీయ పయనం ఉంటుందన్నారు. దానిని కాలమే నిర్ణయిస్తుందన్నారు. అయితే, తాను మాత్రం తీవ్ర మనోవేదనలో ఉన్నానని, తాను ఎవరినీ తప్పు బట్టడం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇన్ని రోజులు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే గెలుపు వెనుక అమ్మ ప్రభంజనం ఉండేదని, ఇక మీదట ఎలా ఉంటుందో అది ప్రజలే నిర్ణయిస్తారని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకేలో జంట నాయకత్వం అన్నది ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నా, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది అమ్మ ప్రభుత్వమేనని, అయితే, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అన్నది మాత్రం చెప్పలేనన్నారు మైత్రేయన్. -
మనసులు మాత్రం!
సాక్షి, చెన్నై : ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. మనసులు మాత్రం..!’ అంటూ పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకే సర్కారులో మంగళవారం హాట్ టాపిక్‌గా మారింది. పన్నీరు మదిలో మాట ఇదేనా..! తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మైత్రేయన్ అసంతృప్తి గళాన్ని వినిపించే పనిలో పడ్డారా..? అన్న చర్చ ఊపందుకుంది. చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగు బావుటా ఎగురవేసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం తనబలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించి చతికిలపడ్డారు. ఎట్టకేలకు చిన్నమ్మ జైలుకు వెళ్లడం, సీఎం పళనిస్వామి బలం పెరగడం వెరసి విలీన బాటసాగింది. పళని, పన్నీరులు ఏకం అయ్యారు. సీఎంగా పళని, డిప్యూటీ సీఎంగా పన్నీరుల పయనం ప్రస్తుతం సాగుతోంది. అయితే, పన్నీరు శిబిరం మాత్రం అసంతృప్తితోనే ఉందని చెప్పవచ్చు. ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు పార్టీ పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ న్యాయం జరిగి ఉంటే ఒట్టు. అదే సమయంలో పన్నీరు అధికారాల్ని పీకి, కేవలం పదవిని మాత్రం కట్టబెట్టి ఉన్నారన్న ఆరోపణలున్నాయి. సీఎం పళనిస్వామి బలం మాత్రం రోజురోజుకు ఢిల్లీ స్థాయిలో పెరుగుతున్నా, పన్నీరు మాత్రం పతనం అవుతున్నారన్న ఆందోళన మద్దతు దారుల్లో ఉందని చెప్పవచ్చు. నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయలేని పరిస్థితిలో డిప్యూటీ అన్న పదవిని అలంకార ప్రాయంగా పన్నీరు కల్గి ఉండడం ఆయన మద్దతుదారుల్లో అసంతృప్తిని రగుల్చుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఆయన మద్దతుదారులు సీఎం కార్యక్రమాన్ని బహిష్కరించే పనిలో పడ్డారు. మైత్రేయన్ ట్వీట్‌పై చర్చ సీఎం, డిప్యూటీలు ఒకే వేదిక మీద కనిపిస్తున్నా, మద్దతుదారులు మాత్రం వేర్వేరుగా పయనం సాగిస్తుండడంతో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో పన్నీరుకు అత్యంత సన్నిహితుడిగా, శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగిన క్రమంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ మైత్రేయన్ మంగళవారం చేసిన ట్విట్ చర్చకు దారితీసింది. ఇరు శిబిరాలు విలీనమై మూడు నెలలు ముగిసి, నాలుగో నేల మంగళవారంతో అడుగు పెట్టినట్టు గుర్తుచేశారు. ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. అంటూ, మనస్సులు..? మాత్రం..!’ అన్న ప్రశ్నార్థకం, ఆశ్చర్యకర అర్థాలతో చర్చకు తెరలేపడం గమనార్హం. పన్నీరు మదిలో మాటను ఆయన బయట పెట్టారా..? లేదా, సాగుతున్న పరిణామాల నేపథ్యంలో అసంతృప్తిని వెల్లగక్కే విధంగా స్పందించారా..? అన్నచర్చ బయలు దేరింది. అసలే దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో పరిస్థితులు గందరగోళంగా సాగుతుంటే, మైత్రేయన్ వ్యాఖ్యలు కేడర్‌ను మరింత విస్మయంలోకి నెట్టాయి. అదే సమయంలో అమ్మ జయలలితకు వెన్నంటి నీడలా ఉన్న జయ టీవీ మీద ఐటీ దాడుల్ని కేడర్ మరవక ముందే, తాజాగా, ఆ చానల్లో డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్‌తో ప్రత్యేక ఇంటర్వూ్య సాగడాన్ని అన్నాడీఎంకే కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. -
బీజేపీ నైతిక మద్దతు ఇవ్వచ్చు: మైత్రేయన్
ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత.. ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన సీనియర్లలో వి.మైత్రేయన్ ఒకరు. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. ఎప్పుడూ తన జేబులో అమ్మ జయలలిత ఫొటో ఉంచుకుంటారు. బుధవారం ఉదయం నేరుగా పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో కూడా ఆయన వెంటే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అమ్మ వారసత్వం కొనసాగాలనే కోరుకుంటున్నారని, ఇలాంటి తరుణంలో రాత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు చూసిన తర్వాత.. పార్టీ మొత్తం ఆయనవెంటే ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నానని కూడా మైత్రేయన్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు చిన్నమ్మకు సానుకూలంగా లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా 'సేఫ్ గేమ్' ప్లే చేయాలనుకుంటున్నారని, పరిస్థితులను బట్టి ఎటు కావాలంటే అటు మొగ్గేందుకు సానుకూలంగా ఉన్నారని మైత్రేయన్ చెప్పారు. తన ఆత్మసాక్షి ప్రకారమే తాను నడుచుకుంటున్నానని, ఎప్పటికైనా అమ్మకు విశ్వాసపాత్రుడిగానే ఉంటానని చెప్పారు. ఈ తరుణంలో కేంద్రం కావాలంటే నైతిక మద్దతు మాత్రమే ఇవ్వచ్చు గానీ రాజకీయ మద్దతు కాదని ఆయన నొక్కిచెప్పారు. ఇప్పుడు గానీ, రేపు గానీ ఎమ్మెల్యేలంతా పన్నీర్ సెల్వానికి మద్దతు చెప్పాల్సిందేనని మైత్రేయన్ అభిప్రాయపడ్డారు. బలవంతపు రాజీనామాలపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అందువల్ల సీనియర్ నాయకుడైన గవర్నర్ విద్యాసాగర్ రావు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఎప్పుడు సంక్షోభం వచ్చినా జయలలిత కూడా పన్నీర్ సెల్వాన్నే తనకు విశ్వాసపాత్రుడిగా ఎంచుకుని ఆయనకే పదవి అప్పగించారని మైత్రేయన్ గుర్తుచేశారు. అందువల్ల ఇప్పుడు కూడా పార్టీలో ఆయన వెంటే ఎక్కువ మంది వెళ్తారని అన్నారు. -
అది చిన్నమ్మ ఇష్టం!
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని జయలలిత సన్నిహితురాలు శశికళకు అప్పగించేందుకు పార్టీ సర్వసిద్ధంగా ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ వీ మైత్రేయన్ తేల్చిచెప్పారు. 'తమిళనాడు సీఎం పదవి ఎప్పుడు చేపట్టాలన్నది చిన్నమ్మ ఇష్టం మీదే ఆధారపడి ఉంది. ఆమె ఎప్పుడంటే అప్పుడు పదవి అప్పగిస్తాం' అని ఆయన ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో తేల్చిచెప్పారు. జయలలిత వారసురాలిగా చిన్నమ్మ సీఎం పగ్గాలు కూడా చేపట్టాలన్న డిమాండ్ అధికార పార్టీ అన్నాడీఎంకేలో చాలా గట్టిగా వినిపిస్తోంది. రోజురోజుకు ఈ డిమాండ్ ఊపందుకోవడమే కాదు ఏకంగా సీనియర్ నేతలు, మంత్రులు సైతం చిన్నమ్మకే జైకొడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తోంది. ఇండియా టుడే సదస్సులో ఈ విషయాన్ని సెల్వం మాటవరుసకు కూడా స్పందించలేదు. అదే సమయంలో ఇదే సదస్సులో మాట్లాడిన పార్టీ నేత మైత్రేయన్ మాత్రం చిన్నమ్మ ఎప్పుడు సిద్ధమంటే అప్పుడు పదవి అప్పగిస్తామని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.