అది చిన్నమ్మ ఇష్టం!
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని జయలలిత సన్నిహితురాలు శశికళకు అప్పగించేందుకు పార్టీ సర్వసిద్ధంగా ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ వీ మైత్రేయన్ తేల్చిచెప్పారు. 'తమిళనాడు సీఎం పదవి ఎప్పుడు చేపట్టాలన్నది చిన్నమ్మ ఇష్టం మీదే ఆధారపడి ఉంది. ఆమె ఎప్పుడంటే అప్పుడు పదవి అప్పగిస్తాం' అని ఆయన ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో తేల్చిచెప్పారు.
జయలలిత వారసురాలిగా చిన్నమ్మ సీఎం పగ్గాలు కూడా చేపట్టాలన్న డిమాండ్ అధికార పార్టీ అన్నాడీఎంకేలో చాలా గట్టిగా వినిపిస్తోంది. రోజురోజుకు ఈ డిమాండ్ ఊపందుకోవడమే కాదు ఏకంగా సీనియర్ నేతలు, మంత్రులు సైతం చిన్నమ్మకే జైకొడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తోంది. ఇండియా టుడే సదస్సులో ఈ విషయాన్ని సెల్వం మాటవరుసకు కూడా స్పందించలేదు. అదే సమయంలో ఇదే సదస్సులో మాట్లాడిన పార్టీ నేత మైత్రేయన్ మాత్రం చిన్నమ్మ ఎప్పుడు సిద్ధమంటే అప్పుడు పదవి అప్పగిస్తామని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.