సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వం చేజారిపోయింది. ఇప్పుడు పార్టీ కూడా పరాధీనమైతే.. ఇక రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని అన్నాడీఎంకే అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మరో ఆరునెలలు గడువు కోరుతూ అన్నాడీఎంకే అధిష్టానం ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి ఉత్తరం రాసినట్లు తెలుస్తోంది. పార్టీ చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే.. ఆరునెలల గడువు కోరడం వెనుక అంతరార్థంగా చెబుతున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మరలా తెరపైకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించలేక పోవడాన్ని అవకాశంగా తీసుకుంటున్న అన్నాడీఎంకేపై వల విసరడం ప్రారంభించారు. పారీ్టలోని తన అనుచరులతో సెల్‌ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రగతి కోసం తాను ఎంతో శ్రమించాను, ఈరోజు పార్టీ పతనం దిశగా పయనిస్తుంటూ చూస్తూ ఊరుకోనని ఇటీవల స్పష్టం చేశారు. సీఈసీ వద్ద గుర్తింపు పొందిన పారీ్టలన్నీ ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనే నియమావళి ఉంది.
అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ, జిల్లాస్థాయి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయ ఆఫీస్ బేరర్స్ ఎంపికను 2014 ఆగస్టు నుంచి 2015 ఏప్రిల్ వరకు నిర్వహించారు. 2014 ఆగష్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏడోసారి ఎన్నికైనారు. మిగతా కార్యవర్గం కూడా సంప్రదాయం ప్రకారం ఎన్నుకున్నారు. అయితే ఆ తరువాత అనేక కారణాల వల్ల సంస్థాగత ఎన్నికలు జరగలేదు. 2017 సెపె్టంబరులో జనరల్‌బాడీ సమావేశాన్ని మాత్రమే నిర్వహించి ప్రధాన కార్యదర్శికి బదులుగా సమన్వయకర్త (పన్నీర్‌సెల్వం) ఉప సమన్వయకర్త (ఎడపాడి పళనిస్వామి)ను ఎన్నుకున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ వ్యవహారాల్లో సవరణలు తీసుకురాగా జనరల్‌బాడీ సమావేశం ఆమోదించింది. త్వరలో రాష్ట్ర, జిల్లా, గ్రామస్థాయి పార్టీ నిర్వాహకుల ఎన్నికలు నిర్వహిస్తామని అధిష్టానం ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లోగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా అనేక కారణాల వల్ల అది జరగలేదు.
జూలై రెండోవారంలో ఎన్నికలు జరపాల్సిందిగా ఈసీ సూచించగా మరో ఆరునెలలు గడువు ఇవ్వాలని అన్నాడీఎంకే అధిష్టానం కోరినట్లు సమాచారం. ఈ మేరకు పదిరోజుల క్రితం ఈసీకి ఉత్తరం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశాన్ని ఈ ఏడాది జనవరి 9వ తేదీన నిర్వహించారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ పరాజయం, కరోనా సెకెండ్ వేవ్ వల్ల సంస్థాగత ఎన్నికలు జరపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోవడంతో పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో జయలలిత నెచ్చెలి శశికళ పార్టీని తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శశికళతో నష్టం లేదు: ఎడపాడి
అన్నాడీఎంకేలోని 10 మందితోనే కాదు వెయ్యిమంది నేతలతో మాట్లాడినా తమకు ఎలాంటి ఆందో ళన, నష్టం లేదని ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. సేలం జిల్లా ఓమలూరులో పార్టీ నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శశికళ పా రీ్టలో లేరు, కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేనందున ఆమెకు అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment