
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైన అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆయన పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలసి మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. 2009 నుంచి 2019 వరకు కరూర్ ఎంపీగా ఉన్న తంబిదురై గత లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. దీంతో, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
త్వరలోనే తమిళనాడు ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం అధికార అన్నాడీఎంకేకు మూడు, ప్రతిపక్ష డీఎంకేకు రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనను రాజ్యసభకు పంపాలని పార్టీ నేతలపై తంబిదురై ఒత్తిడి తెలుస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.