బీజేపీతో పొత్తా.. డిపాజిట్లు గల్లంతే | AIADMK Leaders Not Interested For Alliance With BJP | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తా.. డిపాజిట్లు గల్లంతే

Published Sun, Jan 20 2019 2:14 PM | Last Updated on Sun, Jan 20 2019 4:45 PM

AIADMK Leaders Not Interested For Alliance With BJP - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేకి అమ్మలేని లోటు తీర్చలేనిది. జయలలిత స్థాయిలో చరిష్మా కలిగిన నేత లేకపోవడం ప్రస్తుతం ఆ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పరపతి కలిగి ఉండి కనీస స్థాయిలోనైనా ఓటర్లు ఆకట్టుకునే నాయకుడు ఆపార్టీ లేడనే చెప్పాలి. ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మొదలుకుని అందరూ తమ నియోజవర్గాలకు పరిమితమైన వారే. ఇటువంటి బలహీనమైన స్థితిలో పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడం అంటే ఆషామాషీకాదు. పైగా సమీప ప్రత్యర్థి పార్టీ డీఎంకేకు స్టాలిన్‌ వంటి బలమైన నాయకుడు ఉన్నాడు. కరుణానిధి వారసుడిగా తగిన స్థాయిలో ప్రజాకర్షణ కూడా ఉంది.

ఒకవైపు అమ్మలేని లోటు, మరోవైపు దీటైన స్టాలిన్‌తో పోటీపడడం అన్నాడీఎంకేకి బలహీనంగా మారింది. ఈ స్థితిని గట్టెక్కాలంటే ఎన్నికల్లో పొత్తు తప్పనిసరి అనే సత్యాన్ని అన్నాడీఎంకే అగ్రనేతలు ఏనాడో గ్రహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవలి పొత్తుపై దృష్టిసారించారు. అమ్మ కన్నుమూసిన తరువాత బలహీనంగా మారిన అన్నాడీఎంకే ప్రభుత్వం కేంద్రం కనుసన్నల్లో నడవకతప్పలేదు. ప్రధాని మోదీ తెరవెనుక నుంచి ఆశీర్వాదంతోనూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. ఈదశలో బీజేపీతో పొత్తు అనివార్యం అన్న స్థితిలోకి అన్నాడీఎంకే పడిపోయింది. ‘అమ్మ’లేని అనాథగా మిగిలిన అన్నాడీఎంకేని ఆసరాగా  చేసుకుని అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది.

అన్నాడీఎంకే అగ్రజులైన పన్నీర్‌సెల్వం, ఎడపాడి సైతం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మంత్రులు, పార్టీలోని సీనియర్‌ నేతలు కమలనాథులవైపు కన్నెత్తిచూసినా కరుసై పోతామని హెచ్చరిస్తున్నారు. ‘జయ జీవించి ఉండగా బీజేపీతో ఎంతటి స్నేహం చేసినా ఎన్నికల్లో పొత్తుకు సిద్ధం కాలేదు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పరిస్థితిని బట్టీ బీజేపీకి అండగా నిలిచేవారు.. మనం కూడా అదే తీరులో వ్యవహరిస్తాం’ అని మెజార్టీ నేతలు ఎడపాడి, పన్నీర్‌పై ఒత్తిడిచేస్తున్నారు. బీజేపీని కాదనే ధైర్యం లేక, పార్టీలోని ముఖ్యనేతల సూచనలను ధిక్కరించలేక పన్నీర్, ఎడపాడి మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే అన్నాడీఎంకేతో పొత్తుపై పీఎంకే దోబూచులాడుతోంది. ఇటీవలి వరకు సుముఖంగా ఉండిన పీఎంకే తాజాగా ఆలోచనలో పడింది.

కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ రానున్నట్లు కొన్ని సర్వేలు స్పష్టం చేయడం వల్ల బీజేపీ, అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే నష్టమని పీఎంకే అనుమానిస్తోంది. పైగా గత యూపీఏ ప్రభుత్వంలో పీఎంకే అగ్రనేత అన్బుమణి రాందాస్‌ కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఒకేవేళ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తే మరోసారి కేంద్రమంత్రి అయ్యే అవకాశం కోల్పోతామని అన్నాడీఎంకేతో పొత్తుకు వెనకడగు వేస్తోంది. ఇక బీజేపీ వైపు నుంచి ఆలోచిస్తే రాష్ట్రంలోని అన్నాడీఎంకే, పీఎంకే సైతం ఎన్‌బీఏ కూటమిలో చేరేందుకు ఊగిసలాడడం గమనార్హం. అయితే అన్నాడీఎంకేతో పీఎంకే పొత్తు ఖరారైందని, 9 సీట్ల పంపకానికి ఓప్పందం కుదిరిందని మరో సమాచారం వినపడుతోంది.


 బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే  టీటీవీ  దినకరన్‌ మరో వైపు భయపెడుతున్నారు. అదే సమయంలో పెద్ద పార్టీల అండలేకుండా ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా అని అన్నాడీఎంకే ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై కొన్ని రోజులుగా బీజేపీతో పొత్తు ఉండదని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతూ వస్తున్నారు. తన అభిప్రాయాన్ని ఎడపాడి, పన్నీర్‌ వద్ద కూడా స్పష్టం చేసి ఉన్నారు. బీజేపీతో పొత్తును తంబిదురైతోపాటు మెజార్టీ నేతలంతా వ్యతిరేకించడంతో పార్టీ కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం, ఉప కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఇదిలా ఉండగా తంబిదురై తన భార్య, కుమార్తెతో కలిసి శుక్రవారం రాత్రి తిరువారూరు, తంజావూరులోని ప్రధాన ఆలయాలకు వెళ్లి రహస్యంగా పరిహార పూజలు నిర్వహించారు. అధ్యక్ష లేదా ఆస్థాయి పదవులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయేందుకే ఇలాంటి పరిహార పూజలు చేయిస్థారని తెలుసుకున్న పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో అగ్రనేత ఉన్న తంబిదురైని స్థానిక అన్నాడీఎంకే నేతలు ఎవరూ అనుసరించక పోవడం చర్చనీయాంశంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement