
కేకే.నగర్(చెన్నై): తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన మరకత లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు మధురై నుంచి చెన్నైకు శుక్రవారం పుదుకోట జిల్లా విరాళిమలై సమీపంలో వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బస్సు కారును ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతిని అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో 8 కిలోల బరువైన మరకత లింగాన్ని పోలీసులు గుర్తించారు. దాని విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను విచారిస్తున్నారు. కారుకు అధికార అన్నాడీఎంకే జెండా ఉండడం గమనార్హం.