శత్రువులు కుట్రలు చేయడం సహజం
- స్టాలిన్‌పై దినకరన్ మండిపాటు
- కోవింద్‌కు మద్దతుపై చిన్నమ్మదే తుది నిర్ణయం
చెన్నై: ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్తి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతుపై అన్నాడీఎంకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చెప్పారు. ఈ విషయంలో పూర్తి నిర్ణయాధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళదేనని తెలిపారు.
మంగళవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడిన దినకరన్.. ఒకటిరెండు రోజుల్లో బెంగళూరు జైలుకు వెళ్లి చిన్నమ్మను కలుస్తానని, ఆమె ఏం సూచిస్తారో ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
కుట్రలు సహజం
ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ దినకరన్.. ప్రతిపక్ష డీఎంకేపై నిప్పులుచెరిగారు. ‘ప్రభుత్వాన్ని, అన్నాడీఎంకేను అస్థిరపర్చేందుకు శత్రువులు భారీ ఎత్తున కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల్లో అది సహజం’ అని వ్యాఖ్యానించారు.
తమిళనాడు ప్రస్తుత సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు అందినట్లు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే శరవణన్.. స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అవకాశం కోసం ఎదరుచూస్తోన్న ప్రతిపక్ష డీఎంకే.. ముడుపులతో గట్టెక్కిన ముఖ్యమంత్రి గద్దెదిగిపోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది.