
'వాళ్లు తమ ఆత్మను దెయ్యానికి అమ్మేశారు'
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే విజయం సాధించడంపై మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు డబ్బులు తీసుకుని తమ 'ఆత్మని దెయ్యానికి అమ్మేశారు' అంటూ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్లో డీఎంకేకు విజయావకాశాలు స్పష్టం కావటంతో ...అన్నాడీఎంకే డబ్బులు కుమ్మరించి గెలిచిందంటూ మారన్ ఆరోపించారు. 'నేను పరీక్షలో పాసైనా నన్నెందుకు ఫెయిల్ చేశావమ్మా' అని మారన్ మరో ట్వీట్ చేశారు.
కాగా పోలింగ్ పూర్తి అయిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి. అయితే ఓటమి భారంతో ఉన్న ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. దాంతో మారన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మారన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే స్పందిస్తూ... మారన్ ఇన్నిరోజులు నిద్రపోయి ఇప్పుడే మేల్కొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలను అవమానిస్తున్నారని ట్విట్ చేసింది.