
వాదనలు అనవసరం.. తీర్పు ఇవ్వండి
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసు విషయంలో తీర్పు ఇవ్వకుండా కర్ణాటక హైకోర్టుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ కేసు విషయంలో ఇక తాజాగా వాదనలు వినాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే జరిగిన వాదనలతో తుది తీర్పును ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. దీంతోపాటు ఈ కేసు విషయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని, నియమించినా ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో ఈ కేసుపై తాజాగా వాదనలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత ఒకరు కోర్టుకు వెళ్లడంతో దానిపై గతంలో నిర్ణయాన్ని ప్రకటించిన కోర్టు తాజాగా సోమవారం తుది నిర్ణయాన్ని వెలువరించింది.
ఈ కేసులో ప్రత్యేక వాదనలు అవసరం లేదని, ఇప్పటి వరకు జరిగిన వాదనలతో తీర్పు వెలువరించ వచ్చని చెప్పింది. వీరి వ్యవహారం చూస్తుంటే కేసును మరింత జాప్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉందన్న అనుమానం కూడా కోర్టు వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అందిన వెంటనే ఈ కేసులో ముందుకు వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు చెప్పింది. చట్టంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ అనే వ్యవస్థ సరైనది కాదని కోర్టు ఈ సందర్భంగా తప్పుబట్టింది.