సాక్షి, చెన్నై: లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడుకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తులకు తన పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీరుసెల్వం సోమవారం మధురైలో పొత్తులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాదిలో బలమైన కూటమి కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకించలేమని, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు మెగా కూటమిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం డీఎంకే, కాంగ్రెస్ మినహా ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరాజన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నీరుసెల్వం వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి.
తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌లు మిత్రపక్షాలైన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు అధికార అన్నాడీఎంకేకు ఉమ్మడి శత్రువులు కావడంతో ఆపార్టీ తప్పక బీజేపీ పక్షాన నిలుస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మాజీ సీఎం జయలలిత మరణాంతరం శశికళను జైలుకు పంపడం, పళనిస్వామిని సీఎం చెయ్యడం వెనుక బీజేపీ పాత్ర ఉందన్న వార్తలు కూడా ఆమధ్య తమిళనాట గట్టిగానే వినిపించాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పొత్తుల విషయం కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment