
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో కలసిపోటీచేయాలని అధికార అన్నా డీఎంకే, బీజేపీ, పట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మరిన్ని తమిళ పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 5 చోట్ల, పీఎంకే 7 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇతర మిత్రపక్షాలు కూడా ఖరారైన తరువాత అన్నా డీఎంకే ఎన్ని సీట్లలో పోటీచేస్తుందో స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
తొలుత పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్, ఆయన కొడుకు అన్బుమణి రామదాస్‌తో సమావేశమై చర్చలు జరిపిన సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆ తరువాత కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందంతో భేటీ అయి వేర్వేరుగా ఒప్పందం చేసుకున్నారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి(1 లోక్‌సభ స్థానం)లోనూ ఈ కూటమి కొనసాగుతుందని తెలిపారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీలోని 21 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అన్నా డీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ, పీఎంకే అంగీకరించాయి.
విజయ్‌కాంత్‌కూ ఆహ్వానం?
అంతకుముందు, గోయల్.. డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌తో సమావేశం కావడంతో ఆ పార్టీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలొచ్చాయి. తమ మెగా కూటమి విజయం సాధిస్తుందని పన్నీర్ సెల్వం ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళుల హక్కుల సాధన కోసం పది డిమాండ్లను లేవనెత్తామని, అందులో కావేరి డెల్టాను రక్షిత వ్యవసాయ జోన్‌గా ప్రకటించడం, రాష్ట్రంలో కుల ఆధారిత జనగణన నిర్వహించడంలాంటివి ఉన్నాయని రామదాసు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment