శశికళ ఫైల్ ఫోటో
అన్నాడీఎంకే సామ్రాజ్ఞిగా, తమిళనాడు ప్రభుత్వాధినేతగా వెలుగొందాల్సిన శశికళ జైలు గోడల మధ్య చీకటి జీవితం గడుపుతోంది. అయ్యోపాపం అని జాలిచూపాల్సిన అన్నాడీఎంకే నేతలంతా ముఖం చాటేయడం వల్ల కలిగిన బాధను లోలోన అణచుకుంటూ వస్తున్న ఆమె కోపాన్ని వెళ్లగక్కారు. తానే సీఎం చేసిన ఎడపాడిపై తొలిసారిగా నోరు తెరిచారు. పనిలోపనిగా పన్నీర్‌సెల్వంను కూడా కలుపుకుని ఇద్దరిపైనా ఈసీకి ఫిర్యాదు చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు కోపమొచ్చింది. జైలు కెళ్లిన తర్వాత అన్నాడీఎంకే నేతలపై ప్రత్యక్షంగా తొలిసారి స్పందించారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అమ్మ జయలలిత మరణం, సీఎంగా పన్నీర్‌సెల్వం బలవంతపు రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రెండు ముక్కలైంది. శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఆ స్థానంలో ఎడపాడి వర్గం ఆవిర్భవించింది. ఎడపాడి, పన్నీర్ వర్గాల మధ్య పోరు మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ పోటీచేయగా సీఎం ఎడపాడి, మంత్రి వర్గం ప్రచార భారాన్ని భుజానవేసుకుంది. అదే ఎన్నికల్లో పన్నీర్‌వర్గ అభ్యర్థిగా పోటీకి దిగిన మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీప రెండాకుల గుర్తుకోసం పోటీపడడంతో మధ్యే మార్గంగా ఎన్నికల కమిషన్ గుర్తుపై తాత్కాలిక నిషేధం విధించింది. అంతేగాక ఎన్నికలను రద్దు చేసింది.
రెండాకుల గుర్తును అధికార పార్టీకి దక్కేలా చేయాలని దొడ్డిదారి ప్రయత్నాలు చేసిన దినకరన్ జైలు పాలయ్యాడు. పన్నీర్‌సెల్వం సైతం ఈసీ వద్ద పోటీపడ్డాడు. కాలక్రమంలో ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకం కాగా, రెండాకుల గుర్తు కోసం ఎడపాడి, దినకరన్ వర్గాల మధ్య పోటీ పెరిగింది. అత్యధిక సభ్యుల బలం కలిగిన వారికే రెండాకుల చిహ్నంను కేటాయించాలనే వాదనతో ఇరువర్గాలు సంతకాల సేకరణ ప్రారంభించి ఈసీకి సమర్పించడం ప్రారంభించారు. ఎడపాడి, దినకరన్ వర్గాల పత్రాలను స్వీకరించిన ఈసీ రెండాకుల చిహ్నం ఎవరికనే అంశంపై నాన్చుతూ వచ్చింది. అయితే ఇంతలో ఒక పిటిషన్ వల్ల మదురై హైకోర్టు కలుగజేసుకుని ఈనెల 30వ తేదీలోగా రెండాకుల చిహ్నం ఎవరిదో తేల్చాలని ఆదేశించింది. దీంతో విచారణలో వేగం పెంచిన ఈసీ ఎట్టకేలకూ ఈనెల 30వ తేదీన తుది తీర్పునకు సిద్ధమైంది.
ఈసీ వద్ద అడ్డుచక్రం
ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకమై దినకరన్‌ను ఒంటరివాడిని చేయడంపై గత కొంతకాలంగా మండిపడుతున్న శశికళ అదనుకోసం వేచి ఉన్నారు. రెండాకుల చిహ్నం ఎడపాడి వైపు జారిపోయిన పక్షంలో ఇక తమకు రాజకీయ మనుగడ ఉండదనే ఆలోచనకు వచ్చి ఈసీ వద్ద అడ్డుచక్రం వేసింది. రెండాకుల చిహ్నం కోసం మంత్రులు, సర్వసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేరున ఎడపాడి, పన్నీర్ కలసి దాఖలు చేసిన 1877 ప్రమాణ పత్రాల్లో 329 నకిలీవని శశికళ ఆరోపిస్తూ మంగళవారం ఈసీకి లేఖ రాశారు. నకిలీ పత్రాలు సమర్పించిన వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సదరు వ్యక్తుల పేర్ల వద్దనున్న సంతకాలు ఫోర్జరీవని తెలిపింది. ఈనెల 30 వ తేదీన నాల్గవ దశ విచారణలో రెండాకుల చిహ్నం ఎవరికో తేలనున్న సమయంలో శశికళ రాసిన లేఖ ఏమాత్రం పనిచేసేనో వేచి చూడాల్సిందే.
హైకోర్టులో నలపెరుమాళ్ పిటిషన్
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవినే రద్దు చేస్తూ ఇటీవల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై పొల్లాచ్చికి చెందిన పార్టీ సభ్యుడు నలపెరుమాళ్ మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. పార్టీ ఎన్నికలను ఈసీనే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment