
ఎన్ని ట్విస్టులో..
అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజా సంక్షేమ కూటమి అలియాస్ కెప్టెన్ టీంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయోనన్న...
► కూటమిలో పేరు రచ్చ
► నేతల భిన్న స్వరాలు
► కెప్టెన్ టీంకు వామపక్షాల నిరాకరణ
► గౌరవం తగ్గదన్న తిరుమా
► సింగపూర్‌కు విజయకాంత్
► కేడర్‌లో గందరగోళం
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజా సంక్షేమ కూటమి అలియాస్ కెప్టెన్ టీంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయోనన్న ప్రశ్న బయలు దేరింది. ఇంతకీ వీరంతా కలసికట్టుగా ముందుకు సాగుతారా..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో నెలకొంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నాయకుల ఆదివారం భిన్న స్వరాలు పలకడం గమనార్హం. ఒక్కో నేత ఒక్కో వ్యాఖ్యలు, నియోజకవర్గాల ఎంపిక వ్యవహారాల్లోనూ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోంది.
ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల నేతృత్వంలో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమి డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం అని జబ్బలు చరస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కూటమిలోకి డీఎండీకే చేరడంతో ఇక, ఎన్నికల్లో కీలక సమరం అన్నాడీఎంకే, తమ మధ్య మాత్రమే అన్న కొత్త నినాదాన్ని అందుకుని ఉన్నారు. డీఎండీకే నేత విజయకాంత్ రాకతో ఆనంద తాండవం చేసిన ఈ కూటమి నాయకులు, మరింత బలాన్ని పెంచుకునే వ్యూహంతో మరికొన్ని పార్టీల్ని ఆహ్వానించడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ కొత్త ప్రయత్నాలు ఎలాంటి మలుపులకు దారి తీయనున్నయో అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు కారణం ‘సీట్లే’. డీఎండీకేకు వచ్చి రాగానే 124 సీట్లను కట్టబెట్టారు. మిగిలిన 110 సీట్లను ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఎండీఎంకే, వీసీకేలు ఎక్కువ స్థానాల్ని తీసుకోవడాన్ని సీపీఎం, సీపీఐ వర్గాలు తప్పుబడుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ిసీపీఎం, సీపీఐలకు 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్క సీటూ లేని ఎండీఎంకే, వీసీకేలకు మాత్రం అత్యధికంగా స్థానాలు ఏమిటన్న ప్రశ్నను తెర మీదకు తెచ్చారు. దీంతో ఆ రెండు పార్టీల నాయకులు జి రామకృష్ణన్, ముత్తరసన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. అదే సమయంలో తమ సిట్టింగ్ స్థానాల్ని మళ్లీ అప్పగించాల్సిందే అన్న నినాదంతో ఎమ్మెల్యేలు గళం విప్పడంతో పాటుగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదుల్ని పంపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ తతంగం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు కొత్తగా కూటమిలోకి ఎవరైనా వచ్చిన పక్షంలో వారికి సీట్లను విజయకాంత్ సర్దాల్సిందే అన్న నినాదాన్ని కూటమి నేతలు అందుకున్నారు. కూటమిలోకి జికే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ), కృష్ణ స్వామి నేతృత్వంలోని పుదియ తమిళగంలు వచ్చి చేరిన పక్షంలో తనకు కేటాయించిన 124లో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్‌కు ఎదురై ఉన్నది. అన్నాడీఎంకే వద్దే 35 సీట్లకు పైగా డిమాండ్ ఉంచిన జీకే వాసన్ బృందం, తాజాగా, ప్రజా సంక్షేమ కూటమిలోకి వచ్చిన పక్షంలో కనీసం యాభైకు పైగా అడిగే అవకాశాలు ఎక్కువే. ఇక, పుదియ తమిళగం పది వరకు ఆశించ వచ్చు. కొత్త పార్టీల చేరికతో సుమారు 50కు పైగా సీట్లను విజయకాంత్ వదులుకోక తప్పదు.
చివరకు 70 - 75 లోపు సీట్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇందుకు డీఎండీకే వర్గాలు అంగీకరించేనా అన్న ప్రశ్న బయలు దేరింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన విజయకాంత్, ఇంత తక్కువ సీట్లతో బరిలోకి దిగేది అనుమానమే. ఇక, నియోజకవర్గాల ఎంపికలో ఎలాంటి వివాదాలు బయలు దేరుతాయో అన్నది కూడా గమనించాల్సిన విషయమే.తాజా పరిణామాలపై కూటమిలోని నాయకులు ఆదివారం భిన్న స్వరాలు పలకడం చర్చకు దారి తీయడంతో పాటు, సఖ్యతతో ఎన్నికల నాటికి ఈ కూటమి ముందుకు సాగేనా అన్న ప్రశ్న బయలు దేరింది.
పేరు రచ్చ :
విజయకాంత్ రాకతో, ఇక ప్రజా సంక్షేమ కూటమి కెప్టెన్ టీంగా పేరు మారుస్తూ ఎండీఎంకే నేత వైగో ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడ్డ మరుసటి రోజే సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను పెదవి విప్పారు. ఆ పేరు మార్చ వద్దని, ప్రజా సంక్షేమ కూటమి నినాదంతో ముందుకెళ్దామంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు తెర లేపారు. ఇక, తమ వంతు వచ్చినట్టుగా ఆదివారం సీపీఎం నేత జి రామకృష్ణన్ స్పందించారు. కెప్టెన్ టీంను తాము అంగీకరించబోమని, ప్రజా సంక్షేమ కూటమిగానే పిలవాలన్న డిమాండ్‌ను లేవదీశారు. ఈ నెల 23న కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అని స్పష్టం చేయబడిందని, అయితే, కెప్టెన్ టీం అని నామకరణం చేయడానికి ఖండిస్తున్నామన్నారు. ఇక, జి రామకృష్ణన్‌కు సమాధానం ఇచ్చే క్రమంలో వీసీకే నేత తిరుమావళవన్ చేసిన వ్యాఖ్య మరో చర్చకు దారి తీసింది.
ప్రజా సంక్షేమ కూటమి - డీఎండీకే కూటమి అని పిలిచినా, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అని పిలిచినా, కెప్టెన్ టీం అని పిలిచినా అంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, కెప్టన్ టీం అని పిలిచినంత మాత్రాన ఎవరి గౌరవమూ తగ్గదంటూ హితవు పలకడం గమనార్హం. అదే సమయంలో ఎండీఎంకే నేత వైగో ఓ మీడియాతో మాట్లాడుతూ, ఇక, తమ కూటమిలోకి ఏ పార్టీ వచ్చినా సరే, సీట్లను మాత్రం విజయకాంత్ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. నియోజకవర్గాల ఎంపికపై నేతలందరూ నెల 31న సమావేశం కానున్నామని, సామరస్య పూర్వకంగా ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెన్నైలో అడుగు పెట్టిన సమయంలో జి రామకృష్ణన్ వ్యాఖ్యలు సంధించడం, తదుపరి ఆగమేఘాలపై సీతారాం ఏచూరితో ఎండీఎంకే నేత వైగో సంప్రదింపులు జరపడం గమనించాల్సిన విషయం.
సింగపూర్‌కు విజయకాంత్:
తాజా పరిణామాలతో వాడి వేడి చర్చ సాగుతున్న సమయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ సింగపూర్ పయనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసిన విజయకాంత్ కొంత కాలంగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా, ఆయన తప్పనిసరిగా చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆదివారం అర్ధరాత్రి కానీ సోమవారం ఉదయం కానీ సింగపూర్ బయలు దేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులు అక్కడే ఉండబోతున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇక, సీఎం అభ్యర్థి సింగపూర్ పయనం అవుతుండడంతో కూటమిలో కొత్త గందరగోళం బయలు దేరింది.