మాకంటూ ఓటు బ్యాంకు ఉంది: కనిమొళి
కేకే.నగర్: విజయకాంత్ ఒంటరిగా పోటీ చేస్తే తమకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడీఎంకే ఓట్లన్నీ డీఎంకేకే వస్తాయని డీఎంకే ఎంపీ కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రధాన పార్టీలుగా ఢీకొననున్నాయి. డీఎండీకే ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలిపి 28 స్థానాలను గెలిచింది. అనంతరం డీఎండీకే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కూటమి చేరింది. అయితే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ స్థితిలో డీఎండీకేకు డీఎంకే నుంచి పిలుపువచ్చింది. రహస్య సమావేశాలు జరిగాయి. అయితే పొత్తు కుదరలేదు.
దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఏ పార్టీలతో కూటమి చేరాలనేది వారి వ్యక్తిగత విషయం అన్నారు. తాము కూటమి కోసం కొన్ని పార్టీలను ఆహ్వానించామని అదే విధంగా విజయకాంత్‌ను పిలిచామే కానీ అతడిని బలవంత పెట్టలేదన్నారు. అయితే విజయకాంత్ నిర్ణయం వలన డీఎంకేకు నష్టం లేదని తమకంటూ ఓటు బ్యాంక్ ఉందన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగలదని, కొత్త పార్టీలు, కూటమిలు తమ విజయాన్ని అడ్డుకోలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇతర పార్టీలకు ఓటు వేసి ఓట్లును నిరుపయోగం చేయరని డీఎంకేకు తమ ఓట్లును వేసి సద్వినియోగం చేసుకుంటారని కనిమొళి తెలిపారు.