
పడిలేచిన కెరటం
తమిళులందరూ ‘అమ్మ’గా ప్రేమించే జయలలిత ఆ స్థానానికి చేరుకోవడానికి.. వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి చేసిన ప్రస్థానం అసాధారణమైనది!
తమిళులందరూ ‘అమ్మ’గా ప్రేమించే జయలలిత ఆ స్థానానికి చేరుకోవడానికి.. వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి చేసిన ప్రస్థానం అసాధారణమైనది! పురుషాధిక్య రాజకీయాలు.. కరడుగట్టిన ద్రవిడ రాజకీయాల్లో వైష్ణవ బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీ.. అవినీతి ఆరోపణలు.. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు! అరుునా.. మొక్కవోని ధైర్యం.. సడలని సంకల్పం.. ముళ్లబాటను పూలబాటగా మలచుకుని.. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్న పురచ్చి తలైవి!!
రాజకీయ అరంగేట్రం: దక్షిణాది సినీ రంగంలో ముఖ్యంగా తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను 1982లో రాజకీయాల్లోకి తీసుకువచ్చింది అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్. తొలుత పార్టీ సభ్యురాలిగా చేరిన జయలలిత ఏడాదిలోనే 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు.
రాజ్యసభ సభ్యత్వం: ఆ మరుసటి ఏడాదే 1984లో ఎంజీఆర్ కిడ్నీ వ్యాధి చికిత్స కోసం అమెరికా పయనమయ్యే ముందుగా.. పార్టీ నుంచి జయలిలత రాజ్యసభకు ఎన్నికయ్యేలా చేశారు. ఇది పార్టీలో ఎంతో మంది సీనియర్లకు మింగుడుపడలేదు. మరోవైపు ఎంజీఆర్ అమెరికాలో చికిత్స పొందుతుండగా.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున జయ ప్రచారం నిర్వహించి గెలిపించారు. ఎంజీఆర్‌కు, జయలలితకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినా.. జయ చాకచక్యంగా వాటిని ఎదుర్కొన్నారు.
పార్టీ కోసం పోరాటం: 1987లో ఎంజీఆర్ మరణంతో ఆయన వారసత్వం విషయమై అన్నాడీఎంకేలో వివాదం రాజుకుంది. ఎంజీఆర్ భార్య జానకీ రామంచంద్రన్, జయలలితల మధ్య పార్టీ చీలిపోరుుంది. జయలలితవైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. జానకీ రామచంద్రన్ గ్రూపు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అరుుతే.. కొద్ది కాలానికే కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కారు తమిళనాడులో జానకీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.
ప్రతిపక్ష నాయకురాలిగా: ఈ క్రమంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జానకీ గ్రూపుపై జయలలిత పైచేరుు సాధించారు. అరుుతే.. అన్నా డీఎంకేలో ఈ అంతర్గత విభేదాల కారణంగా ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత తమిళనాడు శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్షనేత అయ్యారు. చీలిపోరుున అన్నాడీఎంకే రెండు విభాగాలనూ పునరైక్యం చేసి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పార్టీ రెండు ఆకుల గుర్తును తిరిగి పునరుద్ధరించారు.
తొలిసారి ముఖ్యమంత్రి: జయలలిత ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఆ అవమానకర ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత.. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికలకు ముందు రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈ చేతిలో హత్యకు గురవగా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే విజయానికి ఆ సానుభూతి పవనాలూ దోహదపడ్డారుు. మొత్తం 234 సీట్లకుగానూ 225 సీట్లు అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 1991 జూన్ 24న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగారు.
వరుస విజయం.. ఆపై అనారోగ్యం
కోర్టు కేసుల నుంచి విముక్తి పొందిన జయలలిత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించారు. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కానీ.. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలలుగా ఆస్పత్రికే పరిమితమైన జయలలిత డిసెంబర్ ఐదోతేదీ సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు.
శాసనసభలో దుశ్సాసనపర్వం
1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో జయలలిత తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. సభలో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై అధికారపక్ష సభ్యులు దాడికి దిగారు. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు వచ్చారుు. జయలలిత చిరిగిన చీరతో, రేగిన జుట్టుతో, ఎర్రబడిన ముఖంతో సభ నుంచి బయటకు వచ్చారు. మీడియాకు జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ తాను ఆ శాసనసభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేశారు.
ఆరోపణలు అధిగమిస్తూ..
ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జయలలితపై, ఆమె మంత్రివర్గంపై తీవ్ర స్థారుులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1995లో జయ తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేంత ఆడంబరంగా నిర్వహించడం వంటివి తీవ్ర దుమారం రేపారుు. ఈ క్రమంలో 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోరంగా ఓడిపోరుుంది. ఆ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కారుు. స్వయంగా జయలలిత సైతం డీఎంకే చేతిలో ఓడిపోరుుంది.
కేసులు.. తొలిసారి ఆరెస్టు
తమిళనాడులో 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలితపై పలు అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. కలర్ టీవీల కుంభకోణంలో ఆమెకు రూ.10 కోట్లకు పైగా ముడుపులు అందాయని, టాన్సీ భూములను సొంతం చేసుకోవడనికి జయలలిత సీఎంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేవి ముఖ్యమైన ఆరోపణలు. జయలలితకు ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యంస్వామి కేసు వేశారు. అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన జయను అరెస్ట్ చేయగా.. 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. కలర్ టీవీ కేసును 2000 సంవత్సరంలో కోర్టు కొట్టివేసింది.
సీఎంగా ప్రమాణం.. అనర్హత
2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అరుుతే.. కేసుల కారణంగా జయలలిత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. కానీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆమె 2001 మే 14న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. కానీ.. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు పెండింగ్‌లో ఉండగా ఆమె సీఎం పదవి చేపట్టడం చెల్లదని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. దీంతో ఆమె తనకు విశ్వాసపాత్రుడైన ఒ.పన్నీరుసెల్వానికి సీఎంగా బాధ్యతలు అప్పగించారు.
మళ్లీ ముఖ్యమంత్రిగా..
జయలలిత తనపై నమోదైన కేసుల్లో న్యాయపోరాటం చేశారు. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసులను 2001లో కింది కోర్టులు కొట్టివేయగా.. 2003లో సుప్రీంకోర్టు ఆ తీర్పులను సమర్థించింది. దీంతో అదే ఏడాది మార్చిలో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు.
మరో ఓటమి.. మరో గెలుపు
జయలలిత, ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. కేవలం 61 సీట్లు మాత్రమే గెలుపొందింది. అత్యధికంగా 96 సీట్లు గెలుపొందిన డీఎంకే.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అరుుతే.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మళ్లీ విజయం సాధించారు. అదే ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 11 పార్టీల తో పొత్తు పెట్టుకుని ఈ గెలుపును సొంతం చేసుకుం ది. జయ రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది.
మళ్లీ అరెస్టు, జైలు, విముక్తి
అయితే.. జయలలితను ఆస్తుల కేసు వెంటాడుతూనే ఉంది. 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో జయ మరోసారి సీఎం పదవికి అనర్హురాలయ్యారు. మళ్లీ జైలుకు వెళ్లారు. ఆమె ఒ.పన్నీరుసెల్వంను సీఎంగా నియమించారు. కొద్ది రోజులకే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. 2015లో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం.. జయలలితకు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. దీంతో జయ మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.
ఆరోజు... అవమానం...
ఆ రోజు...
డిసెంబరు 24... 1987
ఎంజీఆర్ మరణ వార్త...
వినగానే జయ స్థాణువైపోరుుంది. కొంచెం సేపటికి తేరుకుని రామవరం గార్డెన్స్ (ఎంజీఆర్ ఇల్లు) వెళ్లేందుకు డ్రైవర్‌ను పిలిచింది. కానీ ఇంట్లోకి అడుగుపెట్టవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. కారులోంచి బయటకొచ్చిన జయ తలుపులను చేతులతో దబదబ మోదింది. చాలాసేపటి తరువాత తలుపులు తెరుచుకున్నా ఎంజీఆర్ మృతదేహం ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఎవరూ జయకు తెలియనివ్వలేదు. చాలాసార్లు మెట్లు ఎక్కి దిగి ఇల్లంతా వెతికింది జయ. ఆమె ముఖం మీదే గదుల తలుపులు వేసేశారు. ఎంజీఆర్ కడచూపు కూడా దక్కనివ్వలేదు. చిట్ట చివరకు.. ఎవరో... మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్‌కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్‌కు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించింది. హాల్‌కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోరుుంది.
కనురెప్పలు సైతం వాల్చకుండా... దాదాపు 21 గంటలు అక్కడే అలాగే ఉండిపోయింది. ఎంజీఆర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె సంకల్పానికి నివ్వెరపోయారు. శారీరకంగా ఇంత దృఢంగా ఉన్న జయపై ఆ దశలో జరిగిన మానసిక హింస అంతా ఇంతా కాదు. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ మద్దతుదారులు జయ చుట్టుపక్కలే నిలబడి కాళ్లు తొక్కుతూ హింసించారు. వెనుకనుంచి గోళ్లతో గిచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు శతధా ప్రయత్నించారు. అరుునా జయ చెక్కు చెదరలేదు. ఆత్మగౌరవానికి తీవ్రమైన భంగపాటు జరిగినా... ఎవరు ఎంత అవహేళన చేసినా ఉన్న చోటి నుంచి అస్సలు కదల్లేదు. పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని స్థితికి చేరిపోయారు ఆమె. అరుుతే అంతటి విషమ పరిస్థితిలోనూ ఆమె మెదడును ఒక ప్రశ్న మాత్రం తొలిచేస్తూనే ఉండి ఉంటుంది. ‘‘ఇప్పుడేం చేయాలి?’’ అని. దాదాపు 38 ఏళ్ల వయసు... మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎదురుగా జీవం లేకుండా పడి ఉన్నాడు. అప్పటివరకూ తమ నాయకుడికి రాజకీయ వారసురాలు తనేనన్న పార్టీ కార్యకర్తలూ పట్టించుకోని పరిస్థితి. అరుుతే... ఓటమిని తేలికగా తీసుకునే వ్యక్తి... .జయ కానే కాదు!
అంతిమ యాత్రలోనూ అదే అవమానం...
ఎంజీఆర్ అంతిమ యాత్ర మొదలయ్యే క్షణాలు... మృతదేహాన్ని ఉంచిన వాహనంలోకి ఎక్కేందుకు జయ ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఓ చేయి అందించారు కూడా. అయితే ఆమె పైకి ఎక్కిందో లేదు... దిగిపోవాల్సిందిగా అరుపులు. చూస్తే ఎదురుగా ఎమ్మెల్యే కేపీ రామలింగం తనవైపు దూసుకొస్తూ కనిపించాడు. ఏమైందో తెలిసేలోపుగానే జయపై దాడి మొదలైంది. జానకీ రామచంద్రన్ దగ్గరి బంధువు దీపన్ జయ నుదుటిపై కొట్టాడు. వాహనం నుంచి కిందకు తోసేశాడు. తగిలిన గాయాలు ఆమెను బాధించాయో లేదోగానీ... ఆ అవమానం మాత్రం ఆమెను నిశ్చేష్టురాలిని చేసేసింది. అంత్యక్రియల్లో పాల్గొనకుండానే వెనక్కు వచ్చేయాల్సి వచ్చింది.
మలుపు తిప్పిన ఆ రోజు...
జయకు జరిగిన అవమానాలు ఏఐఏడీఎంకే కార్యకర్తలందరిలోనూ దావానలంలా వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఆమె ఇంటికి చేరుకోవడం మొదలైంది. జరిగిన అవమానాన్ని ఖండించారు. ఎంజీఆర్ వారసురాలిగా తాము మీ వెంటే ఉంటామని జయకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 97 మంది ఎమ్మెల్యేలతో జానకీ రామచంద్రన్ ఇచ్చిన లేఖను ఆమోదిస్తూ గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 1988 జనవరి ఏడున జానకి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సూచించారు.
ఆ రోజు అసెంబ్లీ అంత గందరగోళంతో నిండిపోయింది. కొంతమంది గూండాలు జయ మద్దతుదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారి పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంలోనే సభాపతి జానకి రామచంద్రన్ విశ్వాస పరీక్ష నెగ్గినట్లు ప్రకటించారు. ఆ వెంటనే... జయ అసెంబ్లీ బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. జానకి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీ సంఘటనలన్నింటితో గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు.
తమిళనాడులో జయ శకానికి నాందీ పడింది!
(‘అమ్మ... జయలలితాస్ జర్నీ ఫ్రమ్ మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్’ గ్రంథం నుంచి. రచయిత: వాసంతి)