వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్-గాజా అంశంపై ఫోకస్ పెట్టిన ట్రంప్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, ఇజ్రాయెల్‌కు మరింత బలం పెరగనుంది.
కాగా, గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గత బైడెన్ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కనపెట్టారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దాదాపు 1,800 ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్‌కు సరఫరా చేయనున్నారు. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా అంటారు. ఇక, ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే పెంటగాన్ ప్రతినిధులు టెల్‌అవీవ్‌కు వెల్లడించారు.
అయితే, ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైన కొద్దిరోజులకు ఈ బాంబులను బైడెన్ నిలిపివేశారు. గతంలో ఈ బాంబులను జనావాసాలపై వాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం కావడంతో బైడెన్ వీటిని నిలిపేశారు. దీంతో అవి గోదాముల్లోనే ఉండిపోయాయి. నాడు బైడెన్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెలే స్వయంగా దేశంలో ఈ బాంబులను తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. వాస్తవానికి గతంలో అమెరికానే దాదాపు 10,000 ఎంకే-84లను ఇజ్రాయెల్‌కు సరఫరా చేసింది. ఇక, తాజాగా ట్రంప్ నిర్ణయంతో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు బాంబు చేరనున్నాయి.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో కూడా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కష్ట సమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment