
చరిత్రాత్మక సందర్భం : భారత్ తరఫున యు.ఎన్.చార్టర్‌పై సంతకం చేస్తున్న సర్ ఎ. రామస్వామి ముదలియార్ (1945)
అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా గుర్తింపు పొందింది. ‘యుఎన్ చార్టర్’గా ప్రసిద్ధి చెందిన ఒడంబడిక 1945లో అమల్లోకి రావడాన్ని ఇది సూచిస్తోంది. ఐరాస చార్టర్ పీఠికలో ఉన్న ప్రాథమిక లక్ష్యాలు ఏమిటంటే, ‘తరువాతి తరాలను యుద్ధ శాపం నుండి రక్షించడం’, ‘మానవుల ప్రాథమిక హక్కులపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించడం’, ‘సామాజిక పురోగతినీ, విస్తృతమైన స్వేచ్ఛలో మెరుగైన జీవన ప్రమాణాలనూ ప్రోత్సహించడం’. అయితే నేడు ఈ లక్ష్యాలు.. పెరుగుతున్న ఐక్యరాజ్యసమితి అసమర్ధత కారణంగా ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. కనుక ఐక్యరాజ్య సమితిని సంస్కరించడం కోసం ఐరాస చార్టర్ నిబంధనలను సమీక్షించడానికి సమయం వచ్చేసినట్లే అనుకోవాలి.
ఐక్యరాజ్యసమితి ప్రధానంగా శాంతి భద్ర తలు; సామాజిక, ఆర్థిక అభివృద్ధి, మానవ హక్కులు అనే మూడు విస్తృత మూలాలపై ఆధారపడి ఉంటోంది. ప్రారంభం నుండి శాంతి భద్రతల విషయంలో ఐరాస తన నిరాశా జనకమైన పాత్ర కారణంగానే తనపై ప్రజల అవగాహనను బలంగా ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇది ఐరాస సభ్య దేశాలను సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధనలో దాని తోడ్పాటు నుండి, ప్రాథమిక మానవ హక్కులు, స్వేచ్ఛల పరిరక్షణ విషయంలో అది సాధించిన ముఖ్యమైన విజయాల నుండి దృష్టిని మరల్చింది.
అంతర్జాతీయ శాంతిభద్రతలను నిర్వహించడం అనే ‘ప్రాథమిక బాధ్యత’ను ఐరాస భద్రతా మండలికి చార్టర్‌లోని ఆర్టికల్ 24 అప్పగించింది. ఆర్టికల్ 25 ప్రకారం యూఎన్‌ఎస్‌సీ నిర్ణయాలకు ఐరాసలోని అన్ని సభ్య దేశాలూ కట్టుబడి ఉంటాయి. ఆర్టికల్ 27.3 ప్రకారం ఈ నిర్ణయాలకు ఆర్టికల్ 23 ప్రకారం ఐదుగురు శాశ్వత సభ్యులు... చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ‘సమ్మతి ఓట్లు’ అవసరం. లేకుంటే వీటో అవుతోంది.
నిజానికి ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో భాగంగా వీటో అనేది లేదు. చర్చలు జరపడానికి, చార్టర్‌ను స్వీకరించడానికి శాన్‌ఫ్రాన్సిస్కో సద స్సులో పాల్గొనడానికి దేశాలను ఆహ్వానిస్తున్నప్పుడు పి5 దేశాల తర పున అమెరికా ముందస్తు షరతుగా దీనిని ఒప్పందంలో చేర్చడం జరిగింది. భారతదేశం తరపున చార్టర్‌పై సంతకం చేసిన భారత ప్రతి నిధి బృందం నాయకుడు సర్ ఎ. రామస్వామి ముదలియార్ వీటోను తాత్కాలిక ‘రక్షణ’ యంత్రాంగంగా చేర్చడానికి ‘అనిష్ట పూర్వకంగానే’ అంగీకరించినట్లు రికార్డుల్లో ఉంది, దానికి ప్రతిఫలంగా చార్టర్ అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత, అంటే 1955 నాటికి అన్ని నిబంధనల సమీక్ష జరగాల్సి ఉంటుంది (ఆర్టికల్ 109).
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత ఐరాస శాంతి భద్రతల స్తంభం కిందికి కుంగిపోయినట్లు 2005 సెప్టెంబరులో ఐరాస 60వ వార్షికోత్సవ శిఖ రాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకులు స్పష్టంగా గుర్తించారు. ‘భద్ర తాసమితిని మరింత విస్తృత స్థాయి ప్రతినిధిగా, సమర్థవంతంగా, పారదర్శకంగా మలచడానికి, దాని ప్రభావాన్ని, దాని నిర్ణయాల చట్ట బద్ధతను, అమలును మరింతగా మెరుగుపరచడం కోసం భద్రతా సమితిలో ముందస్తు సంస్కరణలకు పిలుపునిస్తూ ఆ నాయకులు చేసిన ప్రకటనను జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది, అయితే పద్దెనిమిది సంవత్సరాల తరువాత కూడా, ఈ ఆమోదం నెరవేరలేదు, ప్రధానంగా భద్రతా సమితిలో సంస్కరణకు అయిదు శాశ్వత సభ్య దేశాల వ్యతిరేకతే దీనికి కారణం (ఏకగ్రీవ ప్రకటనలో పి5 భాగమే అయినప్పటికీ).
భద్రతామండలి సంస్కరణలను వ్యతిరేకించడం ద్వారా 5 శాశ్వత సభ్యదేశాలు మండలి అసమర్థతను మరింత తీవ్రతరం చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ లో రాజకీయ పరిష్కారం కోసం (భద్రతాసమితి 2202వ తీర్మానం, 2015 ఫిబ్రవరి 17), అఫ్గానిస్తాన్ లో రాజకీయ పరిష్కారం కోసం (భద్రతా సమితి 2513వ తీర్మానం, 2020 మార్చి 10) ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించి నప్పటికీ, వాటిని అమలు చేయకపోవడం పట్ల భద్రతా మండలి ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. దీనివల్ల లక్షలాది మంది ప్రజలు ప్రతికూల ప్రభావాలకు గురవుతున్నారు.
ప్రస్తుతం భద్రతా మండలి అజెండాలో ఉన్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఐరోపాలలో 50కి పైగా సంఘర్షణలను పరిష్కరించడంలో 5 శాశ్వత సభ్యదేశాలు నిస్సహాయంగా ఉంటు న్నాయి. దౌత్యపరమైన చర్చల కోసం వాతావరణాన్ని సృష్టించేందుకు 6.3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయంతో 85,500 మంది ఐరాస శాంతి పరిరక్షకులను భద్రతామండలి మోహరించిన 12 సంఘర్షణలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ సంఘర్షణల ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తుల సంఖ్య 2015లో 60 మిలియన్ల నుండి 2022 నాటికి 314 మిలియన్లకు పెరిగింది.
ఒకవైపు తన అసమర్థత పెరుగుతున్నప్పటికీ... తీవ్రవాదం, డిజి టల్ సమస్యలు, వాతావరణ మార్పుల వంటి ప్రపంచ సవాళ్లను కూడా తన పరిధిలోకి తీసుకురావడానికి భద్రతామండలి ప్రయత్నించింది. భద్రతామండలి నైపుణ్యం, వనరుల కొరత అనేది నాటో వంటి ఐరాసయేతర కూటములు ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించడానికి తలు పులు తెరిచింది. ఈ ధోరణి ఐరాస చార్టర్‌కి చెందిన సమర్థవంతమైన పనితీరును విచ్ఛిన్నం చేస్తోంది.
1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేసిన 50 మంది సభ్యులలో ఒకరిగా భారతదేశ లక్ష్యం ఏమిటంటే ఐరాసను సంస్కరించడమే కానీ దాని స్థానాన్ని భర్తీ చేయడం కాదు. భారతదేశ సమగ్ర విధానం శాంతి భద్రతలు, అభివృద్ధి మధ్య అంగీకృత పరస్పర సంబంధంపై నిర్మితమైంది, ఇది బహు పాక్షికతలోకి ‘మానవ–కేంద్రీకృత‘ దృక్పథాన్ని తీసుకువస్తుంది. భద్ర తాసమితి కోసం, యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఏఎస్‌ఓసీ) కోసం మొదటి చార్టర్ సంస్కరణలను సర్వసభ్య సమావేశం విజయవంతంగా ఆమోదించిన 1963 నాటి నుండి, ఐక్య రాజ్యసమితిలో భారతదేశ ట్రాక్ రికార్డ్ అటువంటి సంస్కరణవాద పాత్రను పోషించడానికి తన విశ్వసనీయతను కలిగి ఉంది.
ఈ రోజు ఐరాస ప్రధాన ఎజెండా ఏమిటంటే దాని 17 నిలకడైన అభివృద్ధి లక్ష్యాలతో కూడిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌పై 2030 ఎజెండా. 2015 సెప్టెంబరులో యూఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ విశ్వవ్యాప్త ఫ్రేమ్‌వర్క్.. అభివృద్ధి పాటు శాంతి భద్రతలను పెంపొందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు (ఎస్‌డీజీ గోల్ నెం. 16.8) బహుపాక్షిక నిర్ణయాధికారంలో, ముఖ్యంగా భద్రతా మండలిలో మెరుగైన, సమాన భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి.
ఎజెండా 2030 అనేది ఎస్‌డీజీలను అమలు చేయడానికీ, భాగస్వామ్యాల (ఎస్‌డీజీ 17) ద్వారా బహుపాక్షిక ఆర్థిక ప్రవాహాలనూ, తగిన సాంకేతిక పరిజ్ఞానాన్నీ బదిలీ చేయడానికి కట్టుబడి ఉంది. అసమానతలను తగ్గించడానికి (ఎస్‌డీజీ 10) నిబద్ధత వహిస్తూనే, ఇది పేదరికాన్ని నిర్మూలించడం (ఎస్‌డీజీ 1), ఆహార భద్రత (ఎస్‌డీజీ 2), ఆరోగ్యం (ఎస్‌డీజీ 3), విద్య (ఎస్‌డీజీ 4),లింగ సమానత్వం (ఎస్‌డీజీ 5) వంటి ప్రధాన మానవ హక్కులను సమర్థిస్తుంది. సంస్కరించబడిన ఐక్యరాజ్యసమితి ఈ కట్టుబాట్లను దాని చార్టర్ నిబంధనలలో ఏకీకృతం చేయాలి.
ఐరాస చార్టర్‌కు ఈ సవరణలు ఎలా చేయవచ్చు? చార్టర్ ఆర్టికల్ 109 జనరల్ కాన్ఫరెన్ ్స ద్వారా చేయొచ్చు. అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఐరాస జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు, భద్రతామండలిలో 9 నిశ్చయా త్మక ఓట్లు (పీ5కి ఎటువంటి వీటో అధికారం లేకుండా) అవసరం.
2024 సెప్టెంబరులో జరిగే ఐరాస ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో పాల్గొనడానికి భారతదేశం సిద్ధమవుతున్నందున, ఈ ఫ్రేమ్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఐరాస సెక్రటరీ జనరల్‌కి చెందిన ఉన్నత స్థాయి సలహా మండలి సిఫార్సు చేసిన విధంగా, 21వ శతాబ్దానికి సంస్థను ‘ప్రయోజనం కోసం సరిపోయేలా‘ చేయడానికి ఐరాస సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సదస్సు సిఫార్సు చేయాలి. 2025లో జరిగే ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం ఈ సదస్సును నిర్వహించడానికి తగిన సందర్భం.
అశోక్ ముఖర్జీ
వ్యాసకర్త ఐరాసలో భారత్ మాజీ శాశ్వత సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment