సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యారంగ సంస్కరణలు, మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులకు ట్యాబ్‌లు, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లుతోపాటు గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ లాంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈనెల 10 తేదీ నుంచి నిర్వహిస్తున్నారు.
ఐరాసలో అంతర్భాగమైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలపై ఇందులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాలు, ప్రధానంగా బాలికా విద్యలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై నిర్వహించిన ‘నాడు–నేడు’ స్టాల్‌ను శుక్రవారం పలు దేశాల ప్రతినిధులు సందర్శించి కితాబిచ్చారు.
ప్రధానంగా 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతర నీటి సదుపాయంతో వాష్‌రూమ్‌లు, తాగునీరు, స్వేచ్ఛ పేరుతో శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో బాలికలు చేరికలు పెరగడం, ఇంగ్లీష్‌లో బోధన, బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్, విద్యా కానుక, ట్యాబ్‌ల పంపిణీ, ఐఎఫ్‌పీ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ విద్యా బోధన లాంటివి ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించాయి.
వేగంగా మెరుగైన ఫలితాలు..
ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ ఏపీలో విద్యా సంస్కరణల గురించి వివరించారు. సుస్థిర అభివృద్ధిలో విద్య పాత్ర కీలకమని బలంగా నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యలో లింగ వివక్ష, అసమానతలను తొలగించేందుకు చేపట్టిన నాడు–నేడు పథకం ద్వారా తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలను సాధించినట్లు చెప్పారు.
ఐరాస సదస్సుకు మన విద్యార్థులు
తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు. మన విద్యార్థులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు. విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ఐరాస ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లనున్నారు. ఐరాస ప్రతినిధులతో పాటు వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు సదస్సులో పలు దేశాల ప్రతినిధులను మన విద్యార్థులు కలుసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా వివరించనున్నారు.
బాలిక విద్యకు ప్రశంసలు
కోవిడ్‌ను అధిగమించి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిపై సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు చర్చించారు. ఏపీలో చేపట్టిన విద్యా సంస్కరణలు, చదువులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా సాకారమైన మార్పులను ప్రశంసించారు.
బాలిక విద్యకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, వారు సాధిస్తున్న విజయాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. మన విద్యార్థులను కలసి స్వయంగా మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్‌లో జరిగే సదస్సుకు రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లాలని నిర్ణయించాం. – ఉన్నవ షకిన్ కుమార్, ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్
Comments
Please login to add a commentAdd a comment