సాక్షి, అమరావతి: పేదింటి విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో రాణించాలనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా.. మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పది మంది విద్యార్థులకు అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం వచ్చింది. తొలిసారి విద్యార్థులకు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ను సందర్శించే చాన్స్ లభించింది. సెపె్టంబర్‌లో అమెరికా వెళ్లనున్న మన విద్యార్థులు ఆనెల 17 నుంచి 27 వరకు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యమితి ప్రధాన కార్యాలయంలో స్థిర అభివృద్ధి అనే అంశంపై జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సదస్సులో వివిధ దేశాల్లో విద్యావిధానం, కల్పించిన అవకాశాలపై చర్చించనున్నారు. ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ‘మనబడి నాడు–నేడు’ పథకంతో మారిన పాఠశాలల పరిస్థితులు, వసతులు, ఇంగ్లి‹Ùలో బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫలితంగా వచ్చిన మార్పులపై మన విద్యార్థులు సదస్సులో ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో జరిగే సదస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రసంగించే అవకాశాన్ని ఆ వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎడ్యుకేషన్) డైరెక్టర్ రాధికా అయ్యంగార్ కల్పించారు. ఈమేరకు గురువారం యూఎన్‌వో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్‌కు అధికారికంగా తెలిపారు. అలాగే వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా మన విద్యార్థులు మాట్లాడే అవకాశం లభించిందన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై వివిధ దేశాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించడంపై స్వయంగా వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సెపె్టంబర్‌లో జరిగే సదస్సుకు తీసుకెళతామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఇదో అద్భుత అవకాశంగా ఆయన అభివర్ణించారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసి యా అఫైర్స్ విభాగం అవకాశం కల్పించిందన్నారు.
త్వరలోనే పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ నేతృత్వంలో అమెరికా సందర్శించే విద్యార్థులను ఎంపిక చేస్తామని షకిన్ కుమార్ తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. అందుకు అనుగుణంగా టోఫెల్, డిజిటల్ విద్య, స్మార్ట్ బోర్డుల బోధన, భాషా నైపుణ్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న తీరును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే స్వయంగా ప్రపంచ వేదికపై తెలియజేస్తారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment