జీ20 అధికార దండాన్ని మోదీ నుంచి స్వీకరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని చెప్పారు. ప్రపంచాన్ని భవ్యమైన భవిష్యత్తు దిశగా నడిపించడానికి ఆయా సంస్థలు ‘నూతన వాస్తవ పరిస్థితులను’ ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. కాలానుగుణంగా మార్పునకు లోనుకానివి సమకాలినతను కోల్పోతాయని అన్నారు.
ఆదివారం ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘వన్ ఫ్యూచర్’ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా సరే ఇప్పటి అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి ఏర్పాటైనప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని పేర్కొన్నారు.
అప్పట్లో ఐరాసలో 51 సభ్యదేశాలు ఉండవని, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 200కు చేరిందని గుర్తుచేశారు. అందుకు తగ్గట్లుగా భద్రతా మండలిని కూడా విస్తరించాలని అన్నారు. ప్రపంచంలో ఎన్నో రంగాల్లో మార్పులు జరిగాయని, ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల సంఖ్యల ఎలాంటి మార్పులు జరగలేదని ఆక్షేపించారు. ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను వివరించారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరున జీ20 సదస్సును వర్చువల్‌గా నిర్వహించుకుందామని ప్రతిపాదించారు.
ఇప్పటి సదస్సులో తీసుకున్న నిర్ణయాలతోపాటు ఇతర అంశాలపై మరోసారి సమీక్షిద్దామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీల గురించి మోదీ ప్రస్తావించారు. వర్తమానాన్ని, భవిష్యత్తును ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. క్రిప్టో కరెన్సీలను రెగ్యులేట్ చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవానికి సైబర్‌స్పేస్ అనేది ఒక కొత్త వనరుగా ఆవిర్భవించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని, ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు.
మానవ కేంద్రిత అభివృద్ధి
జీడీపీ కేంద్రిత ప్రయాణానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ కేంద్రిత అభివృద్ధి ప్రయాణం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈ దిశగా తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సామాజిక–ఆర్థిక ప్రగతికి ఉపయోగించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment