ఐక్యరాజ్య సమితి: పాలస్తీనాలోని ఉత్తర గాజాపై దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 24 గంటల్లోగా వీడాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా తప్పుబట్టింది. న్యూయార్క్‌లో మీడియా సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం మాట్లాడారు. ‘ పది లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం అత్యంత ప్రమాదకరం. అసలు ఇది అసంభవం. ఇలాంటి హెచ్చరికలు దారుణం.
యుద్ధానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఉత్తర గాజాపై దాడులు చేస్తామని, ఆలోపు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీచేసి దక్షిణ గాజా వైపుగా స్థానికులు తరలిపోవాలని ఇజ్రాయెల్ వైమానిక దళం హెచ్చరించడం తెల్సిందే. జనావాసాలు మాత్రమేకాదు ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, ఐరాస శిబిరాలకూ ఇదే అలి్టమేటమ్ వర్తిస్తుంది. అందరూ ఉత్తర గాజా వైపు వస్తే ఆరోగ్య సంక్షోభం తలెత్తడం ఖాయం. యుద్ధవాతావరణంలో ఇంతటి భారీ వలసలు క్షేమం కాదు. ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 34 దాడి ఘటనల్లో 11 మంది ఆరోగ్యసిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇంధనం, ఆహారం, తాగునీరు అవసరాలు తీర్చాల్సి ఉంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా వలసలు
ఇజ్రాయెల్ దాడులతో 7వ తేదీæ నుంచి ఇప్పటిదాకా 4,23,000కుపైగా స్వస్థలాలను వదిలిపోయారని ఐరాస రిలీఫ్, రెఫ్యూజీ విభాగం తెలిపింది. వీరిలో 2,70,000కుపైగా ఐరాస శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో ప్రస్తుతం 50,000 మంది గర్భిణులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరికి అత్యవసర ఆరోగ్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రులపైనా రాకెట్ దాడులు జరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా ఉండనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment