న్యూయార్క్: రష్యాతో యుద్ధం కారణంగా చిధ్రమైన ఉక్రెయిన్‌కు, దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్ శరణార్థులకు సాయం చేయాల్సిందిగా భాగస్వామ్య దేశాలను ఐక్యరాజ్య సమితి(యూఎన్) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ను ఆదుకోవడానికి కనీసం 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని యూఎన్ తెలిపింది.
‘రష్యాతో సుదీర్ఘ యుద్ధం కారణంగా వందల వేల సంఖ్యలో చిన్న పిల్లలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితుల వల్లే ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉక్రెయిన్ జనాభాలోని 40 శాతం అంటే కోటి నలభైఆరు లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 33 లక్షల మంది ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో బిక్కబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు.
4.2 బిలియన్ డాలర్లలో 3.1 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్‌కు కావాల్సి ఉండగా 1.1 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్ శరణార్థులకు అవసరమని యూఎన్ వెల్లడించింది. శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశాలకు ఈ సాయం అందిస్తామని తెలిపింది. శరణార్థులకు తాము తిరిగి ఉక్రెయిన్ రావాలన్న భావన కలగకుండా ఉండాలంటే వారిని కష్టాల నుంచి గట్టెక్కించాల్సి ఉందని యూఎన్ అధికారి ఫిలిప్పో గ్రాండి అభిప్రాయపడ్డారు.
కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి 63 లక్షల మంది ఇతర దేశాలకు పారిపోయారు. మరో నలభై లక్షల మంది దేశంలోనే చెల్లాచెదురయ్యారు. వీరిలో ఒక లక్ష మంది దాకా చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment