గుమ్మలక్ష్మీపురం/విజయనగరం అర్బన్: అమెరికా వెళ్లడం.. ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకు కార్యాలయాల్లో ప్రసంగించడం.. వైట్ హౌస్‌ను సందర్శించడం... రాష్ట్రప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు ఆసక్తి చూపడం.. మమ్మలను మనసారా ఆశీర్వదించడం.. అంతా ఓ మిరాకిల్. చదువులో రాణించిన తమలాంటి పేదకుటుంబాల విద్యార్థులకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కల్పించిన ఓ సువర్ణావకాశం ఇది.. థాంక్యూ జగన్‌మామయ్యా అంటూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇటీవల అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అల్లం రిషితారెడ్డి, సామల మనస్విని ఆనందబాష్పాలు రాల్చారు. 15 రోజుల పాటు (గతనెల 15 నుంచి 27వ తేదీవరకు) పర్యటన అనంతరం స్వస్థలాలకు వచ్చిన వారు ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. పర్యటన వివరాలు వారి మాటల్లోనే...
సంతోషంగా ఉంది
మాది కురుపాం మండలంలోని కొండబారిడి గిరిజన గ్రామం. 1 నుంచి 5వ తరగతి వరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎంపీపీ స్కూల్‌లోను, 6వ తరగతి విద్యను కురుపాం మండలం మొండెంఖల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాను. సింగిల్ పేరెంట్‌కావడంతో గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 7వ తరగతిలో సీటు లభించింది. ప్రసుత్తం 9వ తరగతి చదుతున్నాను. ఈ ఏడాది జూన్ 28న నాలుగోవిడత ‘జగనన్న అమ్మఒడి పథకం’ నిధుల విడుదలకు కురుపాం నియోజకవర్గ కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు.
ఆ సమయంలో రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాను. సీఎం ఆశీర్వదించి అమెరికా పర్యటనకు అవకాశం కల్పించారు. మారుమూల గ్రామానికి చెందిన నేను ఓ సారి విశాఖపట్నం, మరోసారి విజ్ఞానప్రదర్శన కోసం విజయవాడకు వెళ్లాను. అంతే.. విమానం ఎక్కుతానని కలలోకూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి చొరవతో ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికాను సందర్శించాను.
అక్కడకి వచ్చిన వివిధ దేశాల విద్యార్థులతో మమేకమయ్యాం. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించాను. చదువుకోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి వారంతా ముగ్దులయ్యారు. భవిష్యత్తులో అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, స్థిరపడాలన్నా సంప్రదించాలంటూ అక్కడి అధికారులు ఆహ్వానించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇంతటి గుర్తింపును, అనుభవాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డినికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– సామల మనస్విని, గుమ్మలక్ష్మీపురం కేజీబీవీ విద్యార్థిని
ఆశయ సాధనకు భరోసా దొరికింది
మాది విజయనగరం శివారు కాలనీ జమ్మునారాయణపురం. తండ్రి రామకృష్టారెడ్డి ప్రైవేటు సంస్థలో మెకానిక్. తల్లి ఉదయలక్ష్మి గృహిణి. అక్క హోహితారెడ్డి నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతోంది. నాకు కూడా ఈ ఏడాది అదే కళాశాలలో సీటు వచ్చింది. వాస్త వంగా మాది నిరుపేద కుటుంబం. చాలీచాలని జీతంతో ఇద్దరమ్మాయిలను ఎలా చదివించగలమంటూ నిత్యం మా తల్లిదండ్రులు మదనపడేవారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ బెంగ తీరింది. పదోతరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాను. ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఐక్యరాజ్య సమితి సందర్శనకు వెళ్లాను. అక్కడ అన్ని దేశాల కల్చర్‌ను తెలుసుకున్నాను. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేశాను. పేదపిల్లల చదువుకు ఆంధ్రా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరించాను. ఐక్యరాజ్య సమితి నిర్వహించే చర్చావేదికల్లో పాల్గొన్నా. ప్రభుత్వం అందిస్తున్న చదువుసాయంతో ఉన్నతంగా రాణిస్తాను.
– అల్లం రిషితారెడ్డి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment