
ఐరాస సదస్సు ప్రాంగణంలో ‘న్యూస్ వీక్’ సీనియర్ ఎడిటర్ ఇన్ చీఫ్ సర్గోన్‌తో ఏపీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సదస్సులో పాల్గొన్నారు. 27 దేశాలకు చెందిన గ్లోబల్ పార్టనర్లు, ప్రపంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, పౌర సమాజ సభ్యులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు న్యూయార్క్లో నిర్వహించిన హైబ్రిడ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ కాన్ఫరెన్స్–2023లో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ప్రసంగించారు.
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు, ఇటు విద్యార్థుల ప్రగతికి ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం గురించి తెలియజేశారు. కాగా, ప్రపంచ శాంతి, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధిపై జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ఉన్నత స్థాయి స్పీకర్లను ఒక్కచోటకు చేర్చి ఇంటర్ డిసిప్లినరీ గ్రూపులను ఏర్పాటు చేశారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సదస్సులో జర్నలిస్ట్స్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ సభ్యులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment