వాటర్‌ వార్నింగ్‌!  | UNESCO World Water Report 2023 Revealed | Sakshi
Sakshi News home page

వాటర్‌ వార్నింగ్‌! 

Published Mon, Mar 27 2023 3:31 AM | Last Updated on Mon, Mar 27 2023 9:45 AM

UNESCO World Water Report 2023 Revealed - Sakshi

సాక్షి, అమరావతి: మానవాళికి నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 – 300 కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటుండగా రాబోయే దశాబ్ద కాలంలో ఇది తీవ్రం కానుంది. అంతర్జాతీయ సమాజం మేల్కొని  సహకరించుకోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో హెచ్చరించింది.

మార్చి 22న వరల్డ్‌ వాటర్‌ డే సందర్భంగా న్యూయార్క్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వినియోగం, నిర్వహణపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. వరల్డ్‌ వాటర్‌ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల (జనాభా­లో 26 శాతం) మందికి సురక్షి­తమైన తాగునీరు దొరకడం లేదు. 3.6 బిలి­య­న్ల (46 శాతం) జనాభాకు సురక్షితమైన పారిశుధ్య నిర్వహణ అందుబాటులో లేదు.

ఉమ్మడి భవిష్యత్తును కాపాడుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎదుర్కొంటున్న పట్టణ జనాభా 2016లో 930 మిలియన్లు ఉండగా 2050 నాటికి 1.7–2.4 బిలియన్లకు పెరుగుతుందని వరల్డ్‌ వాటర్‌ నివేదిక అంచనా వేసింది. నీటిని సంరక్షించుకుంటూ జల వనరుల­ను స్థిరంగా నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయడం ఎంతో అవస­రమని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రీ అజౌలే సదస్సులో సూచించారు.

అందరికీ నీరు– పారిశుధ్యం అందించాలంటే ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రణాళికను అనుసరించాలన్నారు. కలసికట్టుగా నీటి సంక్షోభ నివారణ చర్యలను వేగవంతం చేయాలని యూఎన్‌ వాటర్‌ చైర్‌ పర్సన్‌ గిల్బర్ట్‌ ఎఫ్‌.హౌంగ్‌బో పిలుపునిచ్చారు. 

సహకారంతో సంక్లిష్టతలను అధిగమిద్దాం..
అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే నదులు, జలాశయాల నిర్వహణలో నెలకొన్న సంక్లిష్టతలను అధిగమించకుంటే కష్టాలు తప్పవని యూఎన్‌ వాటర్‌ సదస్సు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది. ఇందుకు ప్రత్యేక దౌత్య మార్గాలను అనుసరించాలని కోరింది. ఇది నీటి భద్రతకు మించి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలిపింది. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందాలున్న 468 జలాశయాలలో కేవలం 6 మాత్రమే ఒప్పందానికి లోబడి ఉన్నట్లు వెల్లడించింది.

2013లో మెక్సికోలో ప్రారంభించిన మోంటెర్రే వాటర్‌ ఫండ్‌ కార్యక్రమం ద్వారా నీటి నాణ్యతను పెంచడంతో పాటు వరద నివారణ చర్యలు విజయవంతమయ్యాయని తెలిపింది. ఇక నైరోబీకి 95 శాతం మంచినీటిని, కెన్యాకు 50 శాతం విద్యుత్‌ను సరఫరా చేసే తానా–నైరోబి నదీ పరీవాహక ప్రాంతంతో పాటు ఆఫ్రికాలో అనుసరించిన విధానాలు పరస్పర సహకారానికి ఉదాహరణగా పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement