సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల ప్రతినిధి బృందానికి అమెరికా అధ్యక్ష భవనం సందర్శించాల్సిందిగా ఆహ్వానం అందింది. శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు అమెరికాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇప్పటివరకు వైట్‌హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్ర మే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైట్‌హౌస్ లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించడం విశేషం. యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో 10 మంది విద్యార్థుల బృందం గురువారం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.
26 వరకు సదస్సులు, సమావేశాలు
మన రాష్ట్ర బృందంలోని విద్యార్థులు శనివారం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (యునెస్కో)లో జరిగే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సదస్సులో పాల్గొంటారు. 17న కొలంబియా యూనివర్సిటీలో జరిగే గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రసంగిస్తారు. 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్‌డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారు.
22న యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో జరిగే ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 25న ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నత ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ప్రసంగిస్తారు. 26వ తేదీన అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగే బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్‌లో పాల్గొంటారు. 27వ తేదీన అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించి 28న భారత్‌కు బయలుదేరతారు.
Comments
Please login to add a commentAdd a comment