శాంతియత్నాలు ఆపొద్దు! | Sakshi Editorial On Russia Ukraine War | Sakshi
Sakshi News home page

శాంతియత్నాలు ఆపొద్దు!

Published Fri, Aug 30 2024 3:25 AM | Last Updated on Fri, Aug 30 2024 3:25 AM

Sakshi Editorial On Russia Ukraine War

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. 

యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్‌లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. 

అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. 

తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్‌స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్‌ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్‌ వెళ్లినందుకు పుతిన్‌ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్‌స్కీ నిష్ఠూరాలాడారు. 

ఇప్పటికైతే ఉక్రెయిన్‌ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్‌లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్‌స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. 

నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్‌ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్‌–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. 

ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్‌–ఫ్రాన్స్‌ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్‌ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్‌ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 

500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్‌ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్‌–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్‌ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్‌16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్‌ హెచ్చరిస్తోంది. 

తప్పనిసరైతే ఉక్రెయిన్‌ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? 

యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్‌–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement