న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్‌లో రాష్ట్ర విద్యార్థులు
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర విద్యార్థులు శనివారం జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఎస్‌డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ గళం వినిపించారు.
వివిధ దేశాల అధినేతలు, కేంద్ర మంత్రులు, యూఎన్ మెంబర్స్ పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరమని, అభివృద్ధికి యువత టార్చ్ బేరర్‌గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న 1.9 బిలియన్ల మంది యువత ప్రపంచ చోదక శక్తిగా మారాలని, సానుకూల సామాజిక మార్పుకు దిక్సూచిగా ఉండాలని అంతర్జాతీయ ప్రతినిధుల ముందు చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు, ప్రపంచాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపించేందుకు యువత కృతనిశ్చయంగా ఉండాలన్నారు. తొలిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు సదస్సులో ఐక్యరాజ్య సమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్, సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, ఉత్తర అమెరికా రాష్ట్ర ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment